Tips To Get Rid Of Musty Smells From Clothes :బట్టలు ఉతకడం ఒక పని అయితే.. వాటిని ఆరబెట్టడం కొంచెం కష్టమనే చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఇది చాలా పెద్ద టాస్క్. వానాకాలం వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల ఉతికిన బట్టలు సరిగ్గా ఆరవు. ముట్టుకుంటే ఆరినట్లుగా అనిపిస్తాయి.. కానీ, వాటిలో తేమ అలాగే ఉండిపోతుంది. వాటిని అలాగే మడతపెట్టి వార్డ్‌రోబ్‌లో పెట్టామంటే వాటిలో ఫంగస్ వృద్ధి చెంది అదో రకమైన వాసన వస్తుంది. అంతేకాదు.. ఈ వాసన తాజాగా ఉన్న బట్టలకూ(Clothes) పట్టడం, ఇళ్లంతా నిండిపోవడంతో విసుగొచ్చేస్తుంటుంది. కాబట్టి వానాకాలంలోనూ దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా, బట్టలు తాజాగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వెనిగర్ :వర్షాకాలంలో దుస్తుల నుంచి వచ్చే చెడు వాసనలను తొలగించడంలో వైట్ వెనిగర్ చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా దీనిలో ఉండే ఆమ్ల స్వభావం దుర్వాసనకు కారణమయ్యే ఫంగస్‌ను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. వాషింగ్ మెషిన్లో బట్టలు వాష్ చేయడానికి ముందుగా డిటర్జెంట్‌లో.. ఒక కప్పు వెనిగర్ యాడ్ చేసుకోవాలి. అదే మీరు నార్మల్‌గా చేతితో బట్టలు ఉతుకుతున్నట్లయితే.. దుస్తులు ఉతికే నీటిలో మీ డిటర్జెంట్‌తో పాటు కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి.
2018లో టెక్స్టైల్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. వెనిగర్ దుస్తుల దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఫంగస్ ను చంపడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూకేలోని లీడ్స్ విశ్యవిద్యాలయంలో పనిచేసే టెక్స్టైల్ సైన్స్ ఎండ్ సాంకేతికత రంగంలో నిపుణుడు డాక్టర్ ఐరెన్ డోనాల్డ్సన్ పాల్గొన్నారు. వెనిగర్ వర్షాకాలంలో బట్టల నుంచి వచ్చే చెడు వాసనలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
నిమ్మరసం : ముఖ్యంగా తడి బట్టలు తేమ కారణంగా దుర్వాసన వస్తున్నట్లయితే బకెట్ నీళ్లలో కాస్త నిమ్మరసం కలిపి అందులో బట్టలను కాసేపు నానబెట్టుకోవాలి. ఆపై వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా నిమ్మకాయలోని సహజ యాసిడ్ దుర్వాసనను తొలగించి బ్యాక్టీరియాను నాశనం చేస్తుందంటున్నారు.