Dutch Tourist Robbed By Cab Driver : భారత్‌కు వచ్చిన నెదర్లాండ్స్ పర్యటకుడిపై ఓ ట్యాక్సీ డ్రైవర్ దాడి చేసి నగదుతో పాటు విలువైన వస్తువులను దొచుకున్నాడు. దీంతో స్వదేశానికి తిరిగి వెళ్లడానికి డబ్బులు లేక నెల రోజుల నుంచి బిచ్చగాళ్ల షెల్టర్ హోమ్‌లో బస చేశాడు. ఈ విషయం మీడియా ద్వారా బయటకు రావటం వల్ల ప్రభుత్వం స్పందించింది. ఇప్పుడు అతడిని నెదర్లాండ్స్‌కు పంపించే ప్రయత్నాలు చేస్తోంది.
ఇదీ జరిగింది
నెదర్లాండ్స్‌కు చెందిన ఆంథోనీ వాన్ ఆర్కెల్(72) అనే వ్యక్తి జనవరిలో ఒడిశాలోని పూరీకి వచ్చాడు. జనవరి 9న క్యాబ్‌లో భువనేశ్వర్ వెళ్లి తన దగ్గర ఉన్న విదేశీ కరెన్సీని మార్చుకుని భితార్కానికాకు బయలుదేరాడు. మార్గ మధ్యలో కారు డ్రైవర్ తన దగ్గర ఉన్న సుమారు రూ. 3.5 లక్షలను నగదును దోచుకున్నాడని ఆంథోనీ తెలిపాడు. 'ఈ విషయంపై నేను డ్రైవర్‌తో గొడవ పడ్డాను. దీంతో ఆ డ్రైవర్ నన్ను తీసుకెళ్లి తన ఇంట్లో మూడు రోజుల పాటు బంధించాడు. ఆ తర్వాత ధోలే పాండా అనే ప్రాంతంలో వదిపెట్టాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను కొంత మంది యువకులు రక్షించారు. వాళ్ల సాయంతోనే నేను పూరీకి తిరిగి వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా దగ్గర డబ్బులు లేకపోవటం వల్ల నేను జనవరి 25 నుంచి మార్చి1 వరకు బిచ్చగాళ్ల షెల్టర్ హోమ్‌లో ఉండాల్సి వచ్చింది.' అని ఆంథోనీ చెప్పాడు.
అతిథి గృహంలో బస
మీడియాలో ఈ విషయం రావటం వల్ల జిల్లా యంత్రాంగం స్పందించి రాష్ట్ర అతిధి గృహంలో బస చేసేందుకు ఏర్పాట్లు చేసిందని ఆంథోనీ తెలిపారు. 'నాకు ఇండియా అంటే చాలా ఇష్టం, భారతదేశంలో నాకు ఇది ఆరో పర్యటన. నాకు ప్రకృతి, దేవాలయాలు అంటే ఇష్టం. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరగవచ్చు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మీడియా, రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. ఇప్పటికీ భారతదేశంపై ఉన్న ఇష్టం అలాగే ఉంది' అని ఆంథోనీ అంటున్నాడు.