Dogs Name Printed on Wedding Card : విశ్వాసానికి మారుపేరు శునకాలు అని చెబుతుంటారు. అలాంటి వాటిని చాలా మంది తమ కుటుంబంలోని సభ్యులుగా చూస్తారు. వాటికి మనుషులకు చేసే సపర్యలు చేస్తుంటారు. మరి ఇంటి సభ్యులని మాటల్లో చెబితే సరిపోదు, చేతల్లో చేసి చూపించాలి అని అనుకున్నాడు ఓ యువకుడు. తన వివాహానికి అతిథులను ఆహ్వానించేందుకు ముద్రించిన పెళ్లి పత్రికపై, నాలుగు పెంపుడు శునకాల పేర్లను ముద్రించాడు మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలోని ఓ యువకుడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
సాగర్ జిల్లాలోని రాణిపుర నివాసి యశ్వంత్ రైక్వార్. సుమారు ఐదేళ్ల క్రితం యశ్వంత్ తన స్నేహితుడిని డ్రాప్ చేయడానికి వెళ్లాడు. అనంతరం తిరిగి వస్తుండగా అతడి స్కూటర్ టైర్ కింద ఓ కుక్క పిల్ల పడింది. అయితే అదృష్టవశాత్తు ఆ దానికి ఏం కాలేదు. దీంతో ఆ కుక్కను యశ్వంత్ తన ఇంటికి తీసుకెళ్లి పెంచుకున్నాడు. క్రమంగా శునకాలపై యశ్వంత్‌కు ఇష్టం ఏర్పడింది. అలా మరో మూడు కుక్కలను ఇంటికి తీసుకువచ్చి పెంచుకుంటున్నాడు.
భౌ-భౌ పార్టీ!
ఇదిలా ఉండగా యశ్వంత్‌కు ఉత్తర్‌ప్రదేశ్ మెహ్రానీకి చెందిన చంచల్ రైక్వార్తో వివాహం నిశ్చయమైంది. అనంతరం తన పెళ్లి ఏర్పాట్లలో యశ్వంత్ నిమగ్నమయ్యాడు. వివాహ ఆహ్వాన పత్రికలు సిద్ధం చేయిస్తున్న తరుణంలో, యశ్వంత్‌కు ఓ ఆలోచన వచ్చింది. తాను అమితంగా ప్రేమిస్తూ, కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న శునకాల పేర్లు కూడా ఆహ్వాన పత్రికలో చేర్చాలనుకున్నాడు. అనుకున్నట్లే పెళ్లి కార్డులో 'భౌ భౌ' పార్టీ పేరుతో నాలుగు కుక్కలు రాకీ, జోజో, కాలు, లాలూ పేర్లు ప్రింట్ చేయించాడు.