SC on Delhi Pollution : దిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించడంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరినప్పటికీ, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్- జీఆర్ఎపీ4 దశ అమలు చేసేందుకు ఎందుకు ఆలస్యం చేశారని దిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. న్యాయస్థానం అనుమతి లేకుండా జీఆర్ఎపీ - 4 కఠినమైన చర్యలను తగ్గించడానికి వీలులేదని తేల్చి చెప్పింది. గాలి నాణ్యత సూచీ 400 దిగువకు చేరినా సరే- కాలుష్య నివారణకు 'జీఆర్ఎపీ స్టేజ్ -4' చర్యలే కొనసాగించాలని అధికారులకు జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు.
'అందుకే దిల్లీకి ఇలాంటి పరిస్థితి'
గత పదేళ్లుగా ఆప్ పాలన వల్ల దిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా అన్నారు. ఆప్ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు కృషి చేయకపోవడం వల్లే దిల్లీలో ఇలాంటి పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఏడాది పొడవునా కాలుష్య నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలి, కానీ ప్రభుత్వం అటువంటి పనలు చేయడం లేదని అన్నారు. పంట వ్యవర్థాలను తగలబెట్టడం గురించి పంజాబ్ ప్రభుత్వంతో దిల్లీ సర్కార్ అసలు మాట్లాడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలోని సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ ప్రజలకు మాస్కులను పంపిణీ చేసి నిరసన తెలియజేశారు.
VIDEO | " grap-4 has been enforced, aqi is above 475. people are falling ill. everyone is coughing. people are suffering because of the bad rule of aap in last 10 years. if these measures are being put in place, and despite if the pollution is not being controlled, then they have… pic.twitter.com/xzRPETxLXj
— Press Trust of India (@PTI_News) November 18, 2024
'కాలుష్యంపై బీజేపీ రాజకీయాలు చేస్తోంది'
ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం దిల్లీ కాలుష్య సమస్యపై రాజకీయాలు చేస్తోందని సీఎం ఆతిశీ విమర్శించారు. హరియాణా, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగులబెట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఆప్ పాలనలో ఉన్న పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దీని వల్ల రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం గణనీయంగా తగ్గిన ఏకైక రాష్ట్రం పంజాబ్ అని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టడం పెరిగాయని అన్నారు. గాలి నాణ్యత క్షీణించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురువుతున్నారని, పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అందుకోసం ఇన్హేలర్లు, స్టెరాయిడ్స్ అవసరమని పేర్కొన్నారు.
ఊపిరి పీల్చలేకపోతున్న దిల్లీ!
దేశ రాజధానిలో గాలి నాణ్యత మరింత దిగజారి 'సివియర్ ప్లస్' స్థాయికి పడిపోయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం సోమవారం ఉదయం 7 గంటలకు గాలి నాణ్యత 483గా నమోదైంది. కాలిందీ కుంజ్ ప్రాంతంలోని యమునా నదిలో హానికారక నురుగు తేలుతూ కనిపించింది. దిల్లీ వాసులు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కళ్లలో మంట, చికాకుగా ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గు, జలుబు వేధిస్తున్నాయని మరికొందరు చెబుతున్నారు. దిల్లీ రాజధాని ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ -4ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అత్యవసర, నిత్యవసర వస్తువులను తీసుకువెళ్లే ట్రక్కులు మినహా దిల్లీలోకి అనవసరమైన ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. LNG, CNG, ఎలక్ట్రిక్, BS-6 డీజిల్ ట్రక్కులను మాత్రమే అనుమతిస్తున్నారు. నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది. మరోవైపు, పొగమంచులోనూ విమానాలు సేఫ్గా ల్యాండ్ అయ్యేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.