తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లికి సరిగా వైద్యం చేయలేదని కోపం!- డాక్టర్​ను ఏడుసార్లు కత్తితో పొడిచిన యువకుడు

తల్లి సరైన చికిత్స అందించలేదని వైద్యుడిపై కోపం పెంచుకున్న యువకుడు - డాక్టర్​తో మాట్లాడేందుకు వెళ్లి కత్తితో పొడిచిన నిందితుడు - దాడిని ఖండిస్తూ ప్రభుత్వ వైద్యుల సమ్మె

Doctor Stabbed in Chennai
Doctor Stabbed in Chennai (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 3:53 PM IST

Doctor Stabbed in Chennai : తన తల్లికి వైద్యం సరిగా అందించలేదని ఓ యువకుడు ప్రభుత్వ డాక్టర్​పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. పలుమార్లు పొడిచి, తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన తమిళనాడు చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్పందించారు. మరోవైపు ఈ దాడిని ఖండిస్తూ ప్రభుత్వ వైద్యులు సమ్మెను చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- పెరుంగళత్తూర్​కు చెందిన విఘ్నేశ్వరన్​ క్యాన్సర్​తో బాధపడుతున్న తన తల్లి ప్రేమను చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆరు నెలలు పాటు ఆంకాలజీ విభాగంలో పనిచేస్తోన్న బాలాజీ జగన్నాథన్ అనే వైద్యుడు ఆమెకు చికిత్స అందించారు. అయినా ప్రేమ ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. దీంతో అసహనానికి లోనైన విఘ్నేశ్వరన్ బుధవారం ఉదయం 10:30 గంటలకు తన తల్లి చికిత్స గురించి మాట్లాడాలని వైద్యుడి దగ్గరకు వెళ్లాడు. మాట్లాడుతుండగా డాక్టర్ బాలాజీపై తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా మిగతా వైద్య సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

డాక్టర్​ బాలాజీని నిందితుడు సుమారు ఏడు సార్లు పొడిచినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఈ దాడిలో వైద్యుడి ఛాతి, ముఖం, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని, విపరీతంగా రక్తస్రవం జరిగిందని వివరించారు. బాలాజీని ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నిందితుడు తల్లికి ఆరుసార్లు కీమోథెరపి ఇచ్చారని, ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని తెలిపాయి. అయితే వైద్యుడు, నిందితుడు మధ్య ఏమి జరిగిందో స్పష్టంగా తెలియదని చెప్పాయి.

స్పందించిన సీఎం
ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించ స్టాలిన్ సమగ్ర విచారణకు ఆదేశించారు. సమయంతో నిమిత్తం లేకుండా సేవలు అందిస్తోన్న వైద్యుల కృషి ఎనలేనిదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

సమ్మెకు దిగిన ప్రభుత్వ వైద్యులు
మరోవైపు ఈ దాడిని ఖండిస్తూ తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘం సమ్మెను ప్రకటించింది. అత్యవసర సేవలు మినహా వైద్య విద్యార్థుల క్లాసులతో పాటు సర్జరీలు, ఓపీడీ సేవలను నిలిపివేసినట్లు ఓ ప్రకటనను విడుదల చేసింది.

ABOUT THE AUTHOR

...view details