తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' BJP కూటమిలో చిచ్చు! - యోగికి అజిత్ పవార్​ కౌంటర్- ఫడణవీస్ అసంతృప్తి

మహాయుతి కూటమిలో లుకలుకలు - యోగీ 'బాటేంగే తో కాటేంగే' వ్యాఖ్యలను ఖండించిన అజిత్ పవార్​ - సీఎంకు బాసటగా నిలిచిన దేవేంద్ర ఫడణవీస్​

Yogi Vs Ajit Pawar
Yogi Vs Ajit Pawar (ETV Bharat & IANS)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Yogi Vs Ajit Pawar :మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన 'బాటేంగే తో కాటేంగే'(చీలిక తేవాలని చూస్తే అంతు చూస్తాం) నినాదం మహాయుతి కూటమిలో అగ్గిరాజేసింది. యోగి నినాదాన్ని ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు కూడా వ్యతిరేకించారు. తాము ఆ నినాదాన్ని సమర్థించమన్నారు. 'బహుశా ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో సీఎం యోగి చేసిన నినాదం పనిచేస్తుందేమో గానీ, మహారాష్ట్రలో అలాంటి వాటికి స్థానం లేదు' అని అజిత్‌ పేర్కొన్నారు. పంకజా ముండే, అశోక్ చవాన్ తదితర బీజేపీ నేతలు కూడా యోగి నినాదంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

"యోగి నినాదాన్ని అంతా వ్యతిరేకించారు. నేనొక్కడినే కాదు. బీజేపీ నేత పంకజా ముండే కూడా వ్యతిరేకించారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడకు వస్తారు. వచ్చి బాటేంగే తో కాటేంగే నినాదమిస్తారు. మేము ఏమని చెప్పామంటే- ఇది ఉత్తర్‌ప్రదేశ్ కాదు. ఉత్తరాది రాష్ట్రాల్లో మీ నినాదం నడుస్తుంది. అంబేడ్కర్ సిద్ధాంతాలపై మహారాష్ట్ర నడుస్తుంది. నేను ఎల్లప్పుడూ ఇది చూశాను."
- అజిత్‌ పవార్‌, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

మహారాష్ట్ర బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లలో ఒకరైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇటీవల ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'బాటేంగే తో కాటేంగే' అనే నినాదం ఇచ్చారు. గతంలో పలు సందర్భాల్లోనూ ఆయన ఈ నినాదం వినిపించారు.

సహవాస దోషం
అయితే ఈ విషయంలో అజిత్‌ పవార్‌ తీరుపై మరో ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కలిసి పనిచేసిన పాత మిత్రుల ప్రభావం అజిత్‌ పవార్‌పై ఇంకా ఉందని కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ విమర్శించారు. "అజిత్‌ పవార్‌ కొన్ని దశాబ్దాలపాటు హిందూ వ్యతిరేక సిద్ధాంతం కలిగిన పాత మిత్రులతో కలిసి పనిచేశారు. ఆయనపై ఇంకా పాతమిత్రుల (కాంగ్రెస్​) ప్రభావం ఉంది. ప్రజల నాడిని, అభిప్రాయాలను అర్థం చేసుకోవటానికి ఇంకా కొంత సమయం పడుతుంది" అని దేవేంద్ర ఫడణవీస్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు పంకజా ముండే, అశోక్ చవాన్‌ కూడా యోగి వ్యాఖ్యల్లోని అంతరార్థాన్ని గ్రహించడంలో విఫలమయ్యారని అన్నారు. అంతా కలిసి ఉండాలనే అర్థంలోనే యోగి ఆ నినాదం ఇచ్చారని ఫడణవీస్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ విభజన ప్రచారానికి యోగి నినాదాన్ని ఓ ప్రతిఘటనగా అభివర్ణించారు. అయితే యోగి నివాదం మహాయుతికి కలిసి వస్తుందా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

ABOUT THE AUTHOR

...view details