Diver Who Saved Thousands Of Lives :నీటిలో మునిగిపోతున్న 3400 మందిని ప్రాణాలతో కాపాడారు ఓ వ్యక్తి. అలాగే 700 గోమాతలను సైతం నీటి నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాలువ, చెరువుల్లో మునిగి చనిపోయిన 17వేల మృతదేహాలను బయటకు తీసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గత 24 ఏళ్లుగా ఇంతలా సమాజానికి సేవ చేస్తున్నారు హరియాణాకు చెందిన ప్రగత్ సింగ్. నిస్వార్థంగా ఎటువంటి ఆర్థిక లాభాన్ని ఆశించకుండా ప్రజలకు సాయపడుతున్నారు. ప్రగత్ సింగ్ ఏ పని చేస్తున్నారు? ఆయనకు ఎందుకు సమాజం పట్ల ఇంత అభిమానం?
24ఏళ్లుగా సామాజిక సేవ
కురుక్షేత్రలోని దబ్ ఖేడి గ్రామానికి చెందిన ప్రగత్ సింగ్ డైవర్‌గా పనిచేస్తున్నారు. అయితే ప్రగత్ సింగ్ తన డైవింగ్ నైపుణ్యాన్ని డబ్బు సంపాదించడం కోసం వాడుకోలేదు. వేలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వాడారు. గత 24ఏళ్లుగా కాలువలు, చెరువుల్లో మునిగిపోతున్న ప్రజలను సురక్షితంగా బయటకు తీస్తున్నారు. మరణాంతరం వేలాది మృతదేహాలను బయటకు తీసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులకు చివరి చూపులు దక్కేవి. అలాగే అంత్యక్రియలను చేసుకునేవారు.
"24ఏళ్ల క్రితం డైవర్‌గా మారి సామాజిక సేవ చేస్తున్నా. మా ఊరు కాలువ ఒడ్డున ఉంది. పశువులను మేపేందుకు కాలువ దగ్గర తీసుకెళ్లేవాడ్ని. అప్పుడే కాలువలో దిగి ఈత నేర్చుకున్నాను. అలా ప్రమాదవశాత్తు కాలువలో పడినవారిని, ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిని నీటి నుంచి బయటకు తీయడం ప్రారంభించాను. ఇప్పటివరకు నీటిలో మునిగిపోయిన 17వేలకు పైగా మృతదేహాలను బయటకు తీశాను. గుర్తించిన మృతదేహాలను వారికి కుటుంబాలకు అప్పగిస్తున్నా. లేదంటే పోలీసులకు అప్పగిస్తున్నా. నీట మునిగిన 3400 మందికి పైగా వ్యక్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాను. కాలువలో మునిగిన 700ఆవులను రక్షించాను. "
-- ప్రగత్ సింగ్, డైవర్