India China Troops Withdrawal :లద్దాఖ్‌లోని దెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం పూర్తయినట్లు సైనిక వర్గాల వెల్లడించాయి. ఇరు దేశాలు సాధారణ పెట్రోలింగ్ తర్వలో ప్రారంభం కానుందని తెలిపాయి. అంతేకాకుండా దీపావళి సందర్భంగా దీపావళి సందర్భంగా సరిహద్దులోని ఇరుదేశాల సమావేశాల పాయింట్ల వద్ద మిఠాయిలు గురువారం పంచనున్నట్లు తెలిపాయి.
భారత్, చైనా బలగాల ఉపసంహరణ పూర్తి - దీపావళికి స్వీట్లు పంచుకోనున్న ఇరు దేశాల జవాన్లు
లద్దాఖ్‌లోని భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి - త్వరలో ప్రారంభం కానున్న ఇరు దేశాల సాధారణ పెట్రోలింగ్
Published : 6 hours ago
|Updated : 5 hours ago
అక్టోబర్ 25న మొదలైన బలగాల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో పూర్తయ్యింది. ఇక పెట్రోలింగ్ విధి విధానాలను ఖరారు చేసేందుకు క్షేత్రస్థాయిలో స్థానిక కమాండర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నట్ల రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. వారే పెట్రోలింగ్ పద్ధతులను నిర్ణయిస్తారని పేర్కొన్నాయి. ఇరు దేశాలు సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇది మార్గదర్శకంగా ఉంటదని ఆశిస్తున్నట్లు చైనా రాయబరి షు ఫీహాంగ్ అన్నారు. భవిష్యత్‌లో సజావుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పొరుగు దేశాలుగా ఉన్నప్పుడు కొన్ని విభేదాలు ఉంటాయని, వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. భారత్, చైనా మధ్య విమాన రాకపోకలు పునఃప్రారంభంపైనా ఆశాభావం వ్యక్తం చేశారు. "2020కి ముందు మనకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేవి. అవి ఉంటే అందరికీ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సమయం, డబ్బు ఆదా అవుతాయి." అని చెప్పారు షు ఫీహాంగ్.
2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఇరుదేశాల సైన్యాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ నేపథ్యంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల మధ్య పలుమార్లు దౌత్య, కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించగా ఘర్షణల కేంద్రమైన దెప్సాంగ్, డెమ్‌చోక్ వద్ద మాత్రం బలగాలు కొనసాగుతూ వచ్చాయి. అలా నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇటీవల వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ పునఃప్రారంభంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.