Disabled Driving Licence : అవయవాలు అన్ని ఉన్న కొంత మంది కారు నడపడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఓ వ్యక్తి రెండు చేతులు లేకున్నా పట్టుదలతో రెండు కాళ్లతో డ్రైవింగ్ చేసి లైసెన్స్‌ను పొంది అందరినీ అబ్బురపరుస్తున్నారు. చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయినా నిరాశ చెందకుండా నిరంతర శ్రమతో ఒక కాలితో డ్రైవింగ్ మరో కాలితో కారు పెడళ్లను నియంత్రిస్తూ నిరంతర అభ్యాసంతో ఆసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన థాన్‌సేన్ గురించి తెలుసుకుందాం.
పట్టుదల ముందు!
తమిళనాడు చెన్నైలో నివసిస్తున్న 30 ఏళ్ల థాన్‌సేన్ తనకు పదేళ్ల వయస్సులో జరిగిన విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయారు. 18 ఏళ్లప్పుడు తన స్నేహితులందరూ డ్రైవింగ్ లైసెన్స్ పొందడాన్ని చూసి తాను కూడా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని ఆశపడ్డారు. కానీ తన ఆశకు రెండు చేతుల లేకపోవడం పెద్ద అవరోధంగా మారింది. అయితే థాన్‌సేన్ పట్టుదల శ్రమ ముందు ఆ సమస్య చిన్నబోయింది.
అసాధ్యాన్ని సుసాధ్యం!
నిరంతరం శ్రమించి రెండు కాళ్లతో కారు నడపడం నేర్చుకున్నారు థాన్ సేన్. ఒక కాలుతో స్టీరింగ్ అదుపు చేయడం, మరో కాలుతో పెడళ్లను నియంత్రిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అనంతరం కేకే నగర్ ప్రభుత్వ పునరావస కేంద్రానికి వెళ్లి తాను డ్రైవింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు వైద్య ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. అనంతరం డ్రైవింగ్ పరీక్షలో పాల్గొని ఉత్తీర్ణత సాధించి డ్రైవింగ్ లైసెన్స్ పొంది తన కళను థాన్‌సేన్ సాకారం చేసుకున్నారు.