MS Dhoni Manager Fraud Case : తిరుపతి ప్రత్యేక దర్శనం కోసం టికెట్లు ఇప్పిస్తామని చెప్పి మహేంద్ర సింగ్ ధోనీ మేనేజర్ స్వామినాథన్ శంకర్‌ను ఓ గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పీఏ అని చెప్పుకునే ఓ వ్యక్తి ద్వారా పరిచయం చేసుకొని లక్షలు దోచేశాడు. అతడిని నమ్మిన స్వామినాథన్ స్నేహితుడు- తిరుపతి ప్రత్యేక దర్శనం కోసమని నిందితుడికి రూ.6.33 లక్షలు పంపించాడు. చివరకు మోసం జరిగిందని గ్రహించిన స్వామినాథన్, అతడి స్నేహితుడు బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే
గతేడాది అక్టోబర్‌లో ధోనీ మేనేజర్ స్వామినాథన్ శంకర్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ వచ్చింది. ఆ వ్యక్తి తాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి సన్నిహితుడినని, తన పేరు నకుల్ అని పరిచయం చేసుకున్నాడు. అలానే సందీప్ అనే ఓ న్యాయమూర్తి కుమారుడు ధోనీని కలవాలనుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో అక్టోబర్ 29న సందీప్, సల్మాన్ అనే మరో వ్యక్తి ఐటీసీ బెంగాల్ హోటల్లో ధోనీని కలిశారు. అప్పుడే 'మీకు కావాల్సినప్పుడు తిరుపతి వేంకటేశ్వర స్వామి ప్రత్యేక దర్శనానికి ఏర్పాటు చేస్తాం' అని ధోనీ మేనేజర్ స్వామినాథన్‌కు సందీప్ చెప్పాడు.
ఆ తర్వాత నవంబర్ 30న స్వామినాథన్‌కు, సందీప్ ఫోన్ చేసి 12 మందికి తిరుపతి ప్రత్యేక దర్శనానికి పాస్‌లు ఉన్నాయని చెప్పాడు. అప్పుడు స్వామినాథన్ తాను దుబాయ్‌లో ఉన్నానని, ఆ పాస్‌లు వేరే వాళ్లకి ఇవ్వొచ్చు అని బదులిచ్చాడు. కానీ మీరే వేరే వాళ్లకు ఇవ్వండి అని స్వామినాథన్‌కు సందీప్ చెప్పాడు.