Seat Allotment In Flight For Child : విమానయాన సంస్థలకు భారత పౌర విమానయాన శాఖ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటును కేటాయించాలని ఎయిర్ లైన్ కంపెనీలకు ఆదేశించింది. పిల్లలు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో విమానాల్లో ప్రయాణించే సందర్భాల్లో చాలాసార్లు తమ పెద్ద వాళ్లకు దూరంగా కూర్చోవాల్సి వస్తోంది. దీనిపై డీజీసీఏకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన డీజీసీఏ, తల్లిదండ్రుల్లో ఇద్దరిలో కనీసం ఎవరో ఒకరి వద్ద కూర్చునే అవకాశం లభిస్తే, వారి ప్రయాణం సజావుగా జరుగుతుందని భావించి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పిల్లలకు పేరెంట్స్ ఇద్దరిలో ఎవరో ఒకరి పక్కన సీటును కేటాయిస్తే ఆ విషయాన్ని తప్పకుండా ప్రయాణ రికార్డులలో నమోదు చేయాలని సూచించింది.
ప్రిఫరెన్స్ సీటింగ్
దీంతో పాటు మరికొన్ని నిబంధనలను డీజీసీఏ సవరించింది. దీనిలోని నిబంధనలలోనే ప్రిఫరెన్షియల్ సీటింగ్ గురించి ప్రస్తావన ఉంది. ప్రయారిటీ ప్రకారం విమాన టికెట్ల కేటాయింపును ఈ నిబంధన తెలియజేస్తుంది. విమానం బయలుదేరే సమయం వరకు చెకిన్ కోసం ఏ సీటునూ ఎంచుకోని ప్రయాణికులకు ఆటోమెటిక్‌గా సీటును కేటాయించే నిబంధన కూడా సవరించిన ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్క్యులర్‌లో ఉంది. దీని ద్వారా జీరో బ్యాగేజీ ఛార్జీలు, భోజనం, స్నాక్/ డ్రింక్ ఛార్జీలు, సంగీత వాయిద్యాల క్యారేజ్ కోసం ఛార్జీలను పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చారు.
పైలట్లు పెర్‌ఫ్యూమ్‌లు వాడొద్దు : డీజీసీఏ
విమానయాన సిబ్బంది సువాసనలు వెదజల్లే పెర్‌ఫ్యూమ్‌లు, మౌత్‌వాష్‌లు వాడొద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గతేడాది డిసెంబర్లో ఓ డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. విమాన సర్వీసుల్లో పనిచేసే సిబ్బందికి తరచూ బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. పెర్‌ఫ్యూమ్‌లు, మౌత్‌వాష్‌లలో అధిక ఆల్కహాల్ శాతం ఉండటం వల్ల తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని డీజీసీఏ భావించింది.