Maharashtra CM Fadnavis : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్ పేరును ఖరారు చేశారు.అనంతరం ముంబయిలోని విధాన్ భవన్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో ఫడణవీస్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ హాజరయ్యారు.
బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో ఏక్‌నాథ్ శిందే, దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్ భేటీ కానున్నారు. గర్నర్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. గురువారం ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఎన్డీఏ కీలక నేతలు దీనికి హాజరుకానున్నారు. సీఎంగా ఫడణవీస్‌తో పాటు శివసేన నేత ఏక్‌నాథ్ శిందే , ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.