Delhi Polls Congress promises : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్లపై హామీల వర్షం కురిపించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే దిల్లీ వాసులకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఉచితంగా రేషన్ కిట్స్‌ను అందిస్తామని వాగ్దానం చేసింది. ఈ విషయాన్ని ఏఐసీసీ దిల్లీ ఇన్ఛార్జ్ ఖాజీ నిజాముద్దీన్, కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. హామీలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.
దిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నీ హామీలను నెరవేరుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, దిల్లీలో కూడా అదే జరుగుతుందని తెలిపారు. అందుకు కాంగ్రెస్ పార్టీకి దిల్లీ ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు
దిల్లీలో మహిళల కోసం 'ప్యారీ దీదీ యోజన'ను కాంగ్రెస్ జనవరి 6న ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతినెలా రూ.2,500 మహిళలకు ఆర్థిక సాయంగా ఇస్తామని హామీ ఇచ్చింది. దిల్లీ ప్రజల కోసం 'జీవన్ రక్ష యోజన'ను ఈ నెల 8న కాంగ్రెస్ ప్రకటించింది. దీని కింద రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా ఇస్తామని పేర్కొంది. దిల్లీలోని నిరుద్యోగ యువత కోసం 'యువ ఉడాన్ యోజన'ను ప్రకటించింది. నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ. 8,500 చొప్పున ఒక ఏడాది పాటు ఇస్తామని జనవరి 12న హామీ ఇచ్చింది.
మరోవైపు దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఐదో జాబితాను గురువారం విడుదల చేసింది. చిట్టచివరిదైన ఈ జాబితాలో ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది. తద్వారా, మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక దిల్లీ శాసనసభకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఆప్, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొనగా- సత్తా చాటేందుకు కాంగ్రెస్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.