Delhi Namaz Incident Police : దిల్లీలోని ఇందర్‌లోక్ ప్రాంతంలో రోడ్డుపై నమాజ్ చేస్తున్న పలువురు వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐ సస్పెండ్ అయ్యారు. ఎస్ఐ దురుసు ప్రవర్తనకు సంబంధించి వైరల్ అయిన వీడియోపై దర్యాప్తు చేపట్టి అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఇందర్‌లోక్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది
ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్ సమీపంలోని కొందరు వ్యక్తులు శుక్రవారం మధ్యాహ్నం రోడ్డుపై నమాజ్ చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎస్ఐ వారితో దురుసుగా ప్రవర్తించారు. వెంటనే స్థానికులు స్పందించి రోడ్డును దిగ్బంధించారు. పోలీసుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నతాధికారుల దృష్టికి వీడియో చేరింది.
వెంటనే దిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎంకే మీనా దర్యాప్తు చేపట్టారు. దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీడియోపై విచారణ చేపట్టిన తర్వాత చర్చలు తీసుకున్నట్లు వెల్లడించారు. అంతకుముందు డీసీపీ వెళ్లి నిరసనకారులను కలిసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు, ఈ ఘటన అవమానకరమని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. "రోడ్డుపై నమాజ్ చేస్తున్న వారితో పోలీసు దురుసు ప్రవర్తన. ఇంతకంటే అవమానకరం ఏముంటుంది?" అని ప్రశ్నించింది.