Captain Anshuman Parents Interview : అమరవీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ సతీమణి స్మృతిపై ఆయన తల్లిదండ్రులు మంజుదేవి, రవిప్రతాప్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించిన కీర్తిచక్ర అవార్డును తాకే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుడు అన్షుమాన్ సింగ్ దశదిన కర్మ అనంతరం కోడలు స్మృతి వెళ్లిపోయిందని తెలిపారు.
''మా కొడుకుకు వచ్చిన కీర్తిచక్ర అవార్డును కోడలు స్మృతి సింగ్ ప్రేమగా తీసుకెళ్తే బాగుండేది. కొన్నిరోజులు మాతో ఉండి ఆప్యాయంగా మసులుకొని ఆ తర్వాత మాకు ఉన్నదంతా ఆమె తీసుకెళ్లినా ఏమీ అనుకునే వాళ్లం కాదు. అన్షుమాన్ సింగ్ అమరుడయ్యాక కోడలు, వాళ్ల పుట్టినింటి వాళ్లు మాతో ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించింది. కోడలు స్మృతి ఇప్పుడు కనీసం మాతో మాట్లాడటం కూడా లేదు. అన్షుమాన్‌కు నేనంటే చాలా ప్రేమ. నా వల్లే అతడు డాక్టర్ అయ్యాడు. నా కొడుకు గుర్తుగా ఇప్పుడు లూసీ అనే కుక్కపిల్ల మాత్రమే ఇంట్లో మిగిలింది. ఆ కుక్కపిల్లను అన్షుమాన్ చాలా బాగా చూసుకునేవాడు'' అని అన్షుమాన్ తల్లి మంజుదేవి ఈటీవీ భారత్తో చెప్పుకొచ్చారు.
ఈటీవీ భారత్తో అన్షుమాన్ తల్లి మంజుదేవి (ETV Bharat) 'మా కోడలు ఇంటి అడ్రస్ మార్చేసింది'
''నేను కూడా సైనికుడిని కీర్తిచక్ర పురస్కారం ప్రాముఖ్యం నాకు తెలుసు. ఇప్పుడు ఆ పురస్కారమే నాకు కనిపించడం లేదు. ఆ అవార్డును అమరవీరుడు అన్షుమాన్ చిత్రపటం దగ్గర ఉంచాలని అనుకున్నాను. కానీ మా కోడలు ఇంటి చిరునామా మార్చేసింది. కీర్తి చక్ర అందుకున్నాక ఆమె తన దారిన తాను వెళ్లిపోయింది. మా కొడుకు చిత్రపటం దగ్గర పెట్టడానికి ఏమీ మిగల్లేదు. మాకు జరిగినది ఎవరికీ జరగకూడదు. కోడలు స్మృతిని మేం కుమార్తెలా చూసుకున్నాం. ప్రతి నిర్ణయంలోనూ ఆమె వెంట నిలిచాం. ఆమె భవిష్యత్ జీవితానికి సహాయపడేందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నాం'' అని అన్షుమాన్ తండ్రి రవిప్రతాప్ తెలిపారు.
ఈటీవీ భారత్తో అన్షుమాన్ తండ్రి రవిప్రతాప్ (ETV Bharat) నెక్ట్స్ టు కిన్ నిబంధనలను మార్చాలి: అన్షుమాన్ తండ్రి
''5 నెలల క్రితమే మా కుమారుడికి స్మృతితో పెళ్లైంది. వారికి ఇంకా సంతానం కలగలేదు. అయినా మా కుమారుడికి వచ్చిన కీర్తిచక్ర పురస్కారాన్ని కోడలు తీసుకెళ్లిపోయింది. మాకు మా కుమారుడు ఫొటో మాత్రమే మిగిలింది. ఇలాంటి సందర్భాల్లో పురస్కారాలు వచ్చినప్పుడు వాటిని తల్లిదండ్రులకే అప్పగించేలా నెక్ట్స్ టు కిన్ నిబంధనలను మార్చాలి. దీనిపై నేను విపక్ష నేత రాహుల్ గాంధీతో కూడా మాట్లాడాను. అగ్నివీర్ స్కీంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాహుల్‌కు సూచించాను. అగ్నివీర్‌లు సైన్యంలో సేవలు అందించే కాల వ్యవధి నాలుగేళ్లకుపైనే ఉండాలి. ఆ తర్వాత వారికి మరో ఉద్యోగం ఇచ్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని కోరాను' అని అన్షుమాన్ తండ్రి వివరించారు.
సియాచిన్‌లో సైనిక విధులు నిర్వర్తించిన కెప్టెన్ అన్షుమాన్ సింగ్ గత ఏడాది జులై 19న తన సహచరులను కాపాడే క్రమంలో అమరుడయ్యారు. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్షుమాన్ సింగ్‌కు కీర్తిచక్ర అవార్డును ప్రకటించింది. ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి మంజుదేవి కలిసి ఈ పురస్కారాన్ని జులై 5న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. అయితే సోషల్ మీడియాలో స్మృతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపింది.