Daughter False Rape Case On Father : సొంతకుమార్తె చేసిన అత్యాచార ఆరోపణల కేసులో జైలుకెళ్లిన ఓ తండ్రి 12ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదలకానున్నారు. 12ఏళ్ల క్రితం దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు తీర్పును పలుమార్లు సవాలు చేసిన తండ్రికి తాజాగా విముక్తి లభించింది. ఆయన్ను నిర్దోషిగా తేల్చుతూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తండ్రిపై కన్నకూతురు మోపిన అభియోగాల్లో నిజం లేదని తేల్చింది. ఎలాంటి నేరం చేయకుండా జైలు శిక్ష అనుభవించిన తండ్రిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
సొంత తండ్రిపైనే తప్పుడు ఆరోపణలు!
మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల ఓ బాలిక(12 ఏళ్ల క్రితం) సొంత తండ్రే తనపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపిస్తూ భోపాల్‌లోని ఓ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం ట్రయల్ కోర్టులో హాజరుపరిచారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే న్యాయస్థానం తండ్రిని దోషిగా తేల్చుతూ జీవితఖైదు విధించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
'ఓరోజు తన తండ్రి తనపై బలవంతంగా అత్యాచారం చేశాడని బాలిక చెప్పింది. దీంతో ఆమె తన తాతయ్య ఇంటికి పారిపోయింది. కొద్దిరోజులకే మళ్లీ తండ్రి వద్దకు తిరిగి వచ్చిన ఆ బాలికపై మళ్లీ అఘ్యాయిత్యానికి పాల్పడ్డాడంటూ స్థానిక పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి కంప్లైంట్ చేసింది. ఆ సమయంలో బాలిక వయస్సు 15 సంవత్సరాలు. ఇక అమ్మాయి ఫిర్యాదు మేరకు మేము ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నాము. అనంతరం ట్రయల్ కోర్టులో హాజరుపరిచాము. విచారణ అనంతరం న్యాయమూర్తి ఆయనకు జీవితఖైదు జైలుశిక్ష విధించింది. అప్పటినుంచి ఇప్పటివరకు తండ్రి జైలులోనే శిక్షను అనుభవించాడు' అని సంబంధిత పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఇక ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసేందుకు బాధిత తండ్రి సిద్ధమయినా ఆయన కేసును విచారించేందుకు ఏ ఒక్క న్యాయవాది ముందుకురాలేదు. దీంతో ఈ విషయం హైకోర్టు లీగల్ సెల్ దృష్టికి వెళ్లింది. అలా 2013లో తొలిసారి ఈకేసుపై అప్పీలుకు వెళ్లగా సాంకేతిక కారణాలతో కేసును కొట్టివేసింది హైకోర్టు. అనంతరం ఈ కేసు ఫైల్‌ను లీగల్ సర్వీసెస్ కమిషన్ న్యాయవాది వివేక్ అగర్వాల్‌కు అందించింది. ఈ కేసు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ట్రయల్ కోర్టు ముందు సమర్పించిన వాస్తవాలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ వాదించారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తు న్యాయవాది వివేక్ అగర్వాల్ మరోసారి హైకోర్టు ముందుకు ఈ కేసును తీసుకువెళ్లారు. తన వాదనలతో 12ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తండ్రిని నిర్దోషిగా తేల్చేందుకు పూనుకున్నారు. అలా ఈయన సాయంతో చేయని నేరానికి ఇన్నేళ్లు జైలుశిక్షను అనుభవించిన ఆ తండ్రి జైలు నుంచి విడుదల కానున్నారు.