Dana Cyclone Update Today :దానా తీవ్ర తుపాను ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య తీరం దాటింది. అర్ధరాత్రి తీరాన్ని తాకే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. తీరంలో అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. దానా శుక్రవారం తెల్లవారుజామున ఒడిశా తీరాన్ని దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలిన తుపాను, కేంద్రపరా జిల్లాలోని భితార్కానికా, భద్రక్‌లోని ధమ్రా మధ్య తీరాన్ని తాకినట్లు వెల్లడించింది.
తీర ప్రాంత జిల్లాలైన భద్రక్, జగత్సింగ్పుర్, బాలాసోర్, కేంద్రపరాలలో గాలులు వీచాయి. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభావిత జిల్లాల్లో అనేక చోట్ల కొన్ని వేల చెట్లు నేలకొరిగాయి. స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయంలోని వృక్షాలు సైతం నేలకూలినట్లు తెలిసింది. తుపాన్ తీవ్రతపై అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం పెద్దఎత్తున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభావిత ప్రాంత ప్రజలను అక్కడికి తరలించింది.
తుపాన్‌ను ఎదుర్కొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వ సంసిద్ధత గురించి సీఎం మోహన్ చరణ్ మాఝీతో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా చర్చించారు. లోతట్టు ప్రాంతాల్లోని హై రిస్క్ జోన్ల నుంచి 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మాఝీ వారికి చెప్పారు. మరోవైపు తీరాన్ని దాటిన తర్వాత తుపాను క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ తెలిపింది. బాలాసోర్, మయూర్‌భంజ్, భద్రక్, కేంద్రపాడ, జగత్‌సింగ్‌పుర్‌లో చాలా చోట్ల తేలికపాటి నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిస్తాయని అంచనా వేసింది.
అటు బంగాల్‌లో కూడా దానా తుపాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల నుంచి 3.5 లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. రాత్రంతా సచివాలయంలోనే ఉన్న మమత పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. పరిపాలన, పోలీసు అధికారులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుపాను విషయంలో ఊహాగానాలు వ్యాప్తి చేసి భయాందోళనలు సృష్టించవద్దని ఆదేశించారు. సహాయం కోసం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం కూడా విద్యాసంస్థలు మూసివేసినట్లు ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దంటూ చేపల వేట నిషేధించినట్లు తెలిపారు.