Cyclist Jaspreet Paul Record Latest :హిమాచల్‌ప్రదేశ్‌లో తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉన్న పరాశర్ రుషి ఆలయానికి సైక్లింగ్ చేసుకుంటూ వెళ్లారు ఓ వ్యక్తి. అది కూడా రెండున్నర అడుగుల మందంతో పేరుకుపోయి ఉన్న మంచుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఒంటరిగా ఈ సరికొత్త ఫీట్ సాధించి రికార్డు సృష్టించారు మండి నగరానికి చెందిన జస్ప్రీత్ పాల్.
ఎవరూ సాహంచని మార్గంలో!
ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం ఐదు గంటలకు మండి నుంచి బయలు దేరారు జస్ప్రీత్ పాల్. అయితే ఆయన పరాశర్ చేరుకోవడానికి ఎవరూ సాహంచని మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గాన్ని చాలా తక్కువ మంది మాత్రమే వినియోగిస్తారు. కానీ జస్ప్రీత్ అదే రూట్ ద్వారా ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు పరాశర్ రిషి ఆలయానికి చేరుకున్నారు.
కొన్ని చోట్ల సైకిల్ లాక్కెళ్లి!
పరాశర్ రుషి ఆలయానికి ఐదు కిలోమీటర్ల ముందు భారీగా మంచు పడడం మొదలైందని జస్ప్రీత్ చెప్పారు. మంచు కురుస్తున్న చోట సైకిల్ తొక్కవచ్చని చెప్పారు. కానీ మంచు మెత్తగా ఉన్న చోట సైకిల్ లాక్కెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అలానే సగం ప్రయాణం పూర్తి చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. హనోగి నుంచి బంధీ ప్రాంతానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు.
త్వరలో ఆ ప్రాంతాలకు కూడా
పరాశర్ రుషి ఆలయానికి తన సైకిల్ ప్రయాణం చాలా ఛాలెంజింగ్‌గా ఉందని జస్ప్రీత్ చెప్పారు. అనుకున్నది విజయవంతంగా పూర్తి చేశానని తెలిపారు. భవిష్యత్తులో సైకిల్‌పై కమ్రునాగ్, షైతాధర్, షికారీ దేవి కొండలకు వెళ్లాలనుకుంటున్నానని వెల్లడించారు. ఈ సీజన్‌లోనే ఆ లక్ష్యాలను కూడా నెరవేర్చుకుంటానని అన్నారు.