Manipur Violence Today :మణిపుర్‌లో మళ్లీ హింస చెలరేగింది. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై ఆందోళనకారులు దాడులకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో భద్రతా బలగాల, నిరసనకాలు మధ్య ఘర్షణ జరిగింది. అంతే కాకుండా సీఎం అల్లుడి నివాసం సహా ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపైనా కూడా ఆందోళనకారులు దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి ఇళ్లలోకి చొరబడి ఫర్నిచర్, వాహనాలను, ఇతర సామగ్రని తగలబెట్టారని చెప్పారు.
జిరిబామ్ జిల్లాలో అనుమానస్పదంగా మృతి చెందిన ముగ్గురు వ్యక్తులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం ఆందోళన కారులు నిరసనలకు దిగారు. 24గంటల్లో హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం బిరెన్ సింగ్ అల్లుడి ఇళ్లతో సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనకారులు ఆందోళన చేశారు. ఆ తర్వాత ఇళ్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. భద్రత దళాలు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు తెలిపారు. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. అల్లర్లపై కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. హింసాత్మక చర్యలకు పాల్పడేవారిపై తీవ్రచర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీచేసింది.
'AFSPA వెనక్కితీసుకోండి'
ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో విధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, 1958- AFSPA చట్టాన్ని సమీక్షించి ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరింది మణిపుర్ ప్రభుత్వం. ఈ విషయం గురించి నవంబర్ 15న రాష్ట్ర కేబినెట్ చర్చించిందని కేంద్రానికి రాసిన లేఖలో హో సెక్రటరీ పేర్కొన్నారు.