Constitution Preamble Amendment :రాజ్యాంగాన్ని అమోదించిన తేదీని మార్చకుండా రాజ్యాంగ ప్రవేశికను సవరించవచ్చా అని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నించింది. రాగ్యాంగ పీఠిక నుంచి 'సోషలిస్ట్', 'సెక్యులర్' పదాలను తొలగించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్యస్మామి దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. భారత రాజ్యాంగ పీఠిక నిర్దిష్ట తేదీతో వస్తుంది కాబట్టి చర్చ లేకుండా దానిని సవరించలేమని తెలిపింది. ఈ అంశంపై విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.
ఇదీ కేసు
రాజ్యాంగ ప్రవేశిక నుంచి 'సోషలిస్ట్', 'సెక్యులర్' పదాలను తొలగించాలని రాజ్యసభ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది. శుక్రవారం సుబ్రమణ్యస్వామి, న్యాయవాది విష్ణుశంకర్ జైన్ వాదనలు వినిపించారు. రాజ్యాంగాన్ని అమోదించిన తేదీ 1949 నవంబర్ 26ను మార్చకుండా రాజ్యాంగ పీఠికను సవరించవచ్చా? అని సుప్రీం కోర్టు ప్రాసిక్యూషన్‌ను ప్రశ్నించింది.
అకడమిక్ పర్పస్ కోసం తేదీని మార్చకుండా రాజ్యాంగ పీఠికను మార్చవచ్చు అని జస్టిస్ దీపాంకర్ దత్త అన్నారు. అందులో సమస్య లేదని తెలిపారు. అయితే దీనికి సుబ్రమణ్య స్వామి బదులిస్తూ 'ఈ విషయంలో అదే అసలు ప్రశ్న' అని అన్నారు. అనంతరం జస్టిస్ దత్త స్పందించి 'బహుశా నేను చూసిన తేదీతో ఉన్న ఏకైక రాజ్యాంగ పీఠిక ఇదేనోమో. ఇందులో పలానా తేదీ రోజు ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాము అని ఉంది. నిజానికి ఒరిజినల్ రాజ్యాంగంలో రెండు పదాలు (సోషలిస్ట్, సెక్యులర్) లేవు' అని అన్నారు.