Jammu Kashmir Election 2024 : జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ పొత్తులో లుకలుకలు బయటపడ్డాయి. ఇరు పార్టీల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించి సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్‌ను సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రీనగర్‌కు పంపినట్లు సమాచారం.
కాంగ్రెస్, ఎన్సీ మధ్య సీట్ల పంపకాలపై విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో కశ్మీర్ లోయ నుంచి కాంగ్రెస్‌కు ఐదు స్థానాలు, జమ్ములో 28 నుంచి 30 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. దీనిపై విముఖత వ్యక్తం చేసిన కాంగ్రెస్, మరికొన్ని స్థానాలు కావాలని పట్టుబట్టింది. సీట్ల సర్దుబాటులో సయోధ్య కుదరకపోవడం వల్ల ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం.
బీజేపీ దూకుడు!
మరోవైపు, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ జాబితాల విడుదల చర్చనీయాంశమైంది. తొలుత 44 మందితో జాబితాను విడుదల చేసిన కమలం పార్టీ కొన్ని గంటలకే దాన్ని ఉపసంహరించుకుంది. ఆ వెంటనే 15 మందితో మళ్లీ జాబితాను విడుదల చేసింది. తొలి విడత ఎన్నికలకు సంబంధించిన 15 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఆ తర్వాత ఒక్క అభ్యర్థి పేరుతో రెండో జాబితాను రిలీజ్ చేసింది. చౌధరీ రోషన్ హుస్సేన్ గుజ్జర్ కొంకేర్నాగ్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.
ముందుగా సోమవారం ఉదయం 44 మందితో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. తొలి విడతలో 15 మంది, రెండో విడత కోసం 10 మంది, మూడో దశకు 19 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఆ జాబితాలో ముగ్గురు కీలక అభ్యర్థుల పేర్లు లేకపోవడం చర్చనీయాంశమైంది. జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, మాజీ ఉప ముఖ్యమంత్రులు నిర్మల్ సింగ్, కవీందర్ గుప్తాకు తొలి జాబితాలో స్థానం దక్కలేదు. ఈ క్రమంలోనే జాబితాను వెనక్కి తీసుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది.