Congress New Headquarters :దేశ రాజధాని దిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ప్రారంభించారు. కొత్త భవనానికి 'ఇందిరాగాంధీ భవన్' అని పేరు పెట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన రోజునే భారత్ నిజమైన స్వాతంత్య్రాన్ని పొందిందంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. భాగవత్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయని అన్నారు.
"దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకటి మా రాజ్యాంగ సిద్ధాంతం, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం. 1947లో దేశానికి స్వాతంత్ర్యం రాలేదంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దేశ ప్రజలందరినీ అవమానించారు. బ్రిటీష్ వారిపై పోరాడిన యోధులందరినీ ఆయన కించపరిచారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయి. ఇకనైనా ఇలాంటి పిచ్చి మాటలు వినడం ఆపాలి" అని రాహుల్ అన్నారు.
కాంగ్రెస్ నేతలు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని రాహుల్ గుర్తుచేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారిని ఆపగలిగేది తమ పార్టీ మాత్రమేనని అన్నారు. తమ పోరాటంలో న్యాయం ఉందని, దాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ కొత్త భవనం కాంగ్రెస్ కార్యకర్తల రక్తంతో రూపుదిద్దుకుందని, ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెందుతుందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యాలయం ఉంది. ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డులోనే కాంగ్రెస్ కార్యకలాపాలు నిర్వహించింది. అక్బర్ రోడ్డులోని భవనాన్ని 1978 నుంచి ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా వినియోగిస్తున్నారు.
ఇటీవల 9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో ఆధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ భవనం నిర్మాణానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది. కోట్లా మార్గ్‌కు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినా అక్బర్ రోడ్డు నుంచి కూడా కార్యకలాపాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2008లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. అనంతరం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చుకున్నారు.