Congress Candidate Returned Ticket : ఒడిశాలో కాంగ్రెస్ ఆ పార్టీ అభ్యర్థులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు! ప్రచారానికి డబ్బుల్లేక కొందరు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారు. నిధుల కొరత కారణంగా పోటీ చేయలేనంటూ పూరీ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి సుచరిత మొహంతి అధిష్ఠానానికి లేఖ రాశారు. మాజీ ఎంపీ బ్రజామోహన్ మొహంతి కుమార్తె అయిన సుచరిత, ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు మెయిల్ పంపారు. పార్టీ ఫండ్ ఇవ్వనందున ఆ ప్రభావం పూరీలో తన ప్రచారంపై తీవ్రంగా పడినట్లు పేర్కొన్నారు. సొంత వనరులతోనే ప్రచారం చేసుకోవాలని ఏఐసీసీ ఒడిశా ఇన్‌ఛార్జ్ అజోయ్‌కుమార్ కరాఖండిగా చెప్పినట్లు సుచిత్ర తెలిపారు.
పాత్రికేయురాలిగా పని చేసిన తాను పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సుచరిత మొహంతి చెప్పారు. ఇప్పటివరకు తనవద్ద ఉన్న డబ్బంతా ప్రచారానికి ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు తన వద్ద పైసా కూడా లేదన్నారు. ప్రజల నుంచి విరాళాలు స్వీకరించేందుకు చేసిన ప్రయత్నమూ విఫలమైనట్లు సుచిత్ర పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రచార వ్యయాన్ని కనిష్ఠ స్థాయికి తెచ్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. సొంతంగా నిధులు సమకూర్చుకోలేకపోయినా, పూరీలో తాను ప్రభావవంతమైన ప్రచారం కోసం పార్టీ కేంద్ర నాయకత్వంతో సహా సీనియర్ నేతలందర్నీ సంప్రదించినట్లు సుచరిత తెలిపారు.