Congress Amethi Scenario :అమేఠీలో ఐదేళ్ల క్రితం వరకు గాంధీ కుటుంబానిదే హవా. కాంగ్రెస్కు ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉండేది. 2019లో బీజేపీ దండయాత్రలో ఈ సామ్రాజ్యాన్ని కోల్పోవాల్సి గాంధీలు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో దీన్ని తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఆ కార్యం పూర్తి చేసే బాధ్యతను, కాంగ్రెస్ అధిష్ఠానం గాంధీల నమ్మకస్థుడైన కిశోరీ లాల్ భుజానెత్తింది. అలా పాతికేళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి ఇక్కడ పోటీకి దిగినట్లయ్యింది. ఇక కిశోరీ లాల్ శర్మ అమేఠీలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో కిశోరీ లాల్ వెంట పార్టీ నియోజక వర్గ నేతలు, కార్యకర్తలు ఉన్నారు
గాంధీ కుటుంబానికి కీలకం
గత నాలుగున్నర దశాబ్దాల్లో దాదాపు 31 ఏళ్లు అమేఠీలో గాంధీ కుటుంబసభ్యులు ప్రాతినిధ్యం వహించారు. 1980లో తొలిసారి సంజయ్ గాంధీ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆయన మరణంతో మరుసటి ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ బరిలోకి దిగారు. అప్పటి నుంచి 1991 వరకు ఆయనే పార్లమెంటు సభ్యునిగా కొనసాగారు. ఇక, 1999లో సోనియా గాంధీ పోటీ చేయగా, ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీని కుమారుడికి అప్పగించారు. అలా 2004 నుంచి రాహుల్ గాంధీ వరుసగా మూడు సార్లు ఈ స్థానంలో విజయం సాధించారు. కానీ, గత ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓటమిపాలవడం వల్ల అమెఠీ కంచుకోటకు బీటలుపడ్డాయి.
ముప్పై ఏళ్లలో రెండోసారి
గత ముప్పై ఏళ్లలో అమెఠీ స్థానం నుంచి గాంధీ కుటుంబేతరులు పోటీ చేయడం ఇది రెండోసారి. 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఈ నియోజకవర్గాన్ని సతీశ్ శర్మకు అప్పగించింది. ఆ ఉప ఎన్నికల్లో గెలిచిన శర్మ, 1996లో రెండోసారి గెలుపొందారు. అయితే, 1998లో మాత్రం బీజేపీ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ మరుసటి ఏడాదే మళ్లీ ఎన్నికలు జరిగ్గా, అమేఠీలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగుర వేసింది. అప్పటి నుంచి గాంధీ కుటుంబసభ్యులే పోటీ చేయగా, మళ్లీ ఇన్నేళ్లకు ఇతరులకు అవకాశమిచ్చారు. తాజా ఎన్నికల్లో అమేఠీ నుంచి కిశోరీ లాల్ శర్మను నిలబెట్టింది.