Congress AAP Seat Sharing Finalised :సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దిల్లీలో పోటీ చేసే స్థానాలపై కాంగ్రెస్, ఆప్ మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కుదిరినట్లు తెలుస్తోంది. ఆప్ నాలుగు, కాంగ్రెస్ 3స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ మేరకు ఇరుపార్టీలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీ, దక్షిణ దిల్లీ, పశ్చిమ దిల్లీ, ఉత్తర దిల్లీ లోక్‌సభ స్థానాల్లో ఆప్ పోటీ చేయనుండగా చాందినీ చౌక్, తూర్పు దిల్లీ, ఈశాన్య దిల్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లో హస్తం పోటీ చేసేలా ఇరుపార్టీలు ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇవ్వడానికి ఇండియా కూటమి గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటు అంశంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అయితే ఇటీవల గుజరాత్, గోవా, అసోంలలో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించడం గమనార్హం. ఇటీవలే ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్ పార్టీ 17 సీట్లలో పోటీ చేయనుంది. మిగతా స్థానాల్లో ఎస్పీ, భాగస్వామ్య పక్షాలు బరిలో దిగనున్నాయి. అయితే వరుస షాక్‌లు తగులుతున్న ఇండియా కూటమికి ఈ ఒప్పందాల వల్ల కాస్త ఊరట లభించినట్లైంది.
ఈసారి జెండా పాతాల్సిందే!
ఈ లోక్‌సభ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ చాలా కీలకంగా భావిస్తోంది. ఆప్ జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గతేడాది ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ పనితీరు అంత బాగోలేదు. దీంతో ఈ లోక్‌సభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్‌గా మారాయి. అయితే దిల్లీ, పంజాబ్ గుజరాత్, గోవా, హరియాణాలో తమ పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయని ఆప్ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సీట్లు గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.