తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మీసం, గడ్డం ఫుల్​గా పెంచారని 80మందిని తీసేసిన కంపెనీ- వాళ్లు చెప్పినట్లు చేసినా!! - Beard Moustache Controversy - BEARD MOUSTACHE CONTROVERSY

Company Layoff Employees For Moustache And Beard : గడ్డం, మీసం పెంచారని కార్మికులను విధుల నుంచి తొలగించింది హిమాచల్ ప్రదేశ్​కు చెందిన ఓ కంపెనీ. తర్వాత కంపెనీ యాజమాన్యం షరతుల మేరకు కార్మికులు గడ్డం, మీసం తొలగించినా ఉద్యోగాల్లోకి తీసుకోలేదు.

Company Layoff Employees For Moustache And Beard
Company Layoff Employees For Moustache And Beard

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 10:39 AM IST

Company Layoff Employees For Moustache And Beard :సాధారణంగా కంపెనీల నుంచి కార్మికులు, ఉద్యోగులను తొలగించడం వెనుక బలమైన కారణం ఉంటుంది. కానీ హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలోని ఓ కంపెనీ విచిత్ర కారణంతో 80 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది యాజమాన్యం. కార్మికుల దినోత్సమైన మే 1న ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం.

యాజమాన్యం షరతుకు అంగీకారం!
పర్వానూ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఓ కంపెనీ కొన్నాళ్ల క్రితం మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. యాజమాన్యంతో కార్మికులు మాట్లాడేందుకు ప్రయత్నించినా అనుమతి ఇవ్వలేదు. దీంతో చేసేదేం లేక కార్మికులు కంపెనీ వద్ద సమ్మె బాట పట్టారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపింది. గడ్డం, మీసం తీసేస్తేనే విధుల్లోకి తీసుకుంటామని కార్మికులకు షరతు పెట్టింది. అందుకు కార్మికులు తొలుత అంగీకరించలేదు.

తర్వాత మళ్లీ మనసు మార్చుకుని యాజమాన్యం షరతుకు అంగీకరించి గడ్డం, మీసం తీసేశారు. అయినా కూలీలను కంపెనీ విధుల్లోకి తీసుకోలేదు. ఈ క్రమంలో కార్మికులు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, పర్వానూ లేబర్ కమిషనర్, సోలన్ జిల్లా కలెక్టర్​కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని లేఖలో కోరారు. ఈ క్రమంలో పర్వానూ లేబర్ ఇన్‌ స్పెక్టర్ లలిత్ ఠాకుర్ కంపెనీని సందర్శించి యాజమాన్యం, కార్మిక పక్షాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు ప్రయత్నించారు.

విచారణకు కలెక్టర్ ఆదేశం
కార్మికుల తొలగింపు ఘటనపై సోలన్ జిల్లా కలెక్టర్ మన్మోహన్ శర్మ ప్రత్యేక దృష్టి సారించారు. పర్వానూలోని ఓ కంపెనీలో గడ్డం, మీసం పెంచారని 80 మంది కార్మికులను తొలగించిన ఉదంతం వెలుగులోకి వచ్చిందని మన్మోహన్ శర్మ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఉద్యోగుల తొలగింపు ఘటన నిజమని తేలితే కంపెనీపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కంపెనీ ఎందుకు కార్మికులపై ఇలాంటి చర్యలు తీసుకుందనే విషయంగా విచారణ జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details