Cyclone Dana Effect :వాయవ్య బంగాళాఖాతంలో 'దానా' తీవ్ర తుపానుగా మారింది. దానా ధాటికి ఒడిశా, బంగాల్, ఝార్ఖండ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున తుపాను తీరం దాటవచ్చని ఒడిశా వాతావరణ విభాగం తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
తీవ్ర రూపం దాల్చిన 'దానా' తుపాను - ఆ మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - CYCLONE DANA
బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన దానా - గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున తుపాను తీరం దాటే అవకాశం -
Published : Oct 24, 2024, 11:45 AM IST
ఒడిశాలోని పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితర్‌కనికా-ధమ్రా సమీపంలో తుపాను తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ‌్యంలో కోస్తా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. బుధవారం సాయంత్రానికే 3 లక్షల మందిని తరలించినట్లు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. మరో ఏడు లక్షల మందిని తరలించే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 14 జిల్లాల నుంచి 10 లక్షల 60 వేల మందిని తరలించాలని ఒడిశా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సహా విపత్తు నిర్వహణ బృందాలను 14 జిల్లాల్లో మోహరించారు. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే 23వ తేదీ నుంచి 25 వరకు జరగాల్సిన పరీక్షలన్నింటినీ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 27న జరగాల్సిన ఒడిశా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను సైతం వాయిదా వేశారు. కొత్త తేదీని తర్వాత ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
అతి భారీ వర్షాలు
బంగాల్లోని అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోల్‌కతాలో సైతం అడపాదడపా వానలు పడుతున్నాయి. తుపాను దృష్ట్యా తూర్పు, ఆగ్నేయ రైల్వేలు గురు, శుక్రవారాల్లో పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేశాయి. దానా తుఫాను ప్రభావంతో ఝార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. కొల్హాన్ ప్రాంతంలో శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.