CM Nitish Kumar Swearing Ceremony :జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ మరోసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నీతీశ్‌తోపాటు బీజేపీ నాయకులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాను డిప్యూటీ ముఖ్యమంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ప్రమాణం చేయించారు. మరో ఎనిమిది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన నీతీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నేతలు హాజరయ్యారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
నీతీశ్‌కు ప్రధాని మోదీ అభినందనలు
బిహార్‌లో ఎన్డీయే సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేదిశగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నీతీశ్ కుమార్, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేసిన సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాకు అభినందనలు తెలిపారు. ఈ కొత్త బృందం రాష్ట్రంలోని ప్రజలందరికీ నిబద్ధతతో సేవలందిస్తుందన్న నమ్మకం ఉందని ట్వీట్ చేశారు.
ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి, డిప్యూటీలు సీఎంలు మీడియాతో మాట్లాడారు. "మేం కలిసి ఉంటాం. 8మంది నాయకులు నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన వారు త్వరలో చేస్తారు. సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారు" అని నీతీశ్ తెలిపారు. బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటామమని డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి చెప్పారు. "ప్రధాని మోదీతోపాటు బీజేపీ అధిష్ఠానం నాపై విశ్వాసం చూపింది. నేను వారి నమ్మకాన్ని నిలబెడతాను" అని విజయ్ సిన్హా తెలిపారు.