Man Fell Into Borewell In Delhi: దిల్లీ జల్‌బోర్డుకు చెందిన నీటి శుద్ధి కేంద్రంలోని బోరుబావిలో పడిన వ్యక్తి మృతి చెందాడు. వ్యక్తిని కాపాడేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు 12 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బోరుబావి నుంచి బాధితుడిని బయటకు తీశాయి.
అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు దిల్లీ పోలీసులు ప్రకటించారు. బోరుబావిలో పడిపోయిన వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు బయటకు తీశాయని మంత్రి ఆతిషి తెలిపారు. బావిలో మృతుడు ఎలా పడిపోయాడన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తారని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆతిషి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అంతకుముందు బోరుబావిలో వ్యక్తి పడిపోవడం దురదృష్టకరమని మంత్రి ఆతిషి దిల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తును ఆదేశించారు. సకాలంలో విచారణ జరిపి బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినియోగించని అన్ని బోరుబావులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లో తనకు నివేదిక సమర్పించాలని తెలిపారు.