Chhattisgarh Encounter Today : సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్ పరిధి కల్పర్ అడవిలో జరిగిన ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఘటనాస్థలంలో ఏకే 47, మూడు ఇన్సాస్ రైఫిల్స్ సహా మొత్తం పదికిపైగా అధునాతన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందాలు మంగళవారం సంయుక్త సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని జిల్లా ఎస్పీ ఇంద్రకల్యాణ్ తెలిపారు. ఈ అడవిలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో గాయపడిన పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బందిని ఆస్పత్రులకు తరలించేందుకు అదనపు బలగాలను కల్పర్ అడవులకు పంపించామని వెల్లడించారు. చనిపోయిన మావోయిస్టుల్లో అగ్రనేత శంకర్‌రావు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఆయన తలపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.