Chandigarh Mayor Polls Supreme Court :Chandigarh Mayor Polls Supreme Court : చండీగఢ్ మేయర్ ఎన్నికలను నిర్వహించిన రిటర్నింగ్ అధికారిపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. 'ఎన్నికల నిర్వహణ తీరు ఇదేనా? ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యం హత్యే. ఆయనపై విచారణ జరపాలి' అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
"ప్రిసైడింగ్ అధికారి ప్రవర్తనను చూసి మేం ఆందోళన చెందుతున్నాం. ఆయన కెమెరాను చూసి ఎందుకు భయపడి పారిపోతున్నారు? ఆయన బ్యాలెట్ పేపర్లను మార్చుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆయన్ను గమనిస్తోందని ఆ అధికారికి చెప్పండి."
-జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
చండీగఢ్ మేయర్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీని భద్రపరచాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీని చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ వాటిని సోమవారం సాయంత్రంలోగా వాటిని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందజేయాలని సూచించింది. ఫిబ్రవరి 7న జరగాల్సిన చండీగఢ్ కార్పొరేషన్ తదుపరి సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని పేర్కొంది.
చండీగఢ్ మేయర్ ఎన్నికలను నిలిపివేయడానికి పంజాబ్, హరియాణా హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ (ఆప్ మేయర్ అభ్యర్థి) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. ప్రిసైడింగ్ అధికారి కాంగ్రెస్, ఆప్ కౌన్సిలర్ల ఎనిమిది ఓట్లు చెల్లకుండా పక్షపాత ధోరణితో వ్యవహరించారని తెలిపారు.
Chandigarh Mayoral Polls : గత నెల 30(జనవరి)న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ విజయం సాధించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.