Car Accident In Madhya Pradesh :మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. ఐదుగురు గాయపడ్డారు. దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన గోడను ఢీకొట్టింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో సల్కాన్పుర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ జరిగింది
భోపాల్ డీఐజీ బంగ్లా ప్రాంతంలోని చౌక్సే నగర్లో పాండే కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం అక్షయ తృతీయ సందర్భంగా సీహోర్ జిల్లాలోని సల్కాన్‌పుర్‌లో ఉన్న బిజాసన్ మాత ఆలయానికి తమ 5నెలల చిన్నారికి తలనీలాలు అర్పించడానికి వెళ్లారు. అనంతరం భైరవ లోయ నుంచి తిరిగి ఇంటికి పయణమయ్యారు. అయితే సాయంత్రం 6గంటల సమయంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హోషంగాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని బుధనీ ఎస్డీపీఓ శశాంక్ గుర్జార్ తెలిపారు.