RG Kar Doctor Rape And Murder Case :కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన జరిగి సరిగ్గా నెల రోజులు అవుతోంది. తొలుత బంగాల్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టగా, ఆ తర్వాత (ఆగస్టు 13) కలకత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి బదిలీ అయ్యింది. కానీ ఇంత వరకు వైద్యురాలి హత్యాచార కేసు విచారణ ఒక కొలిక్కి రాలేదు. సీబీఐకి ఈ కేసు సవాల్‌గా మారింది. నేరం జరిగిన ప్రాంతంలో తగిన ఆధారాలు లభించకపోవడం వల్ల ఆ ప్రభావం దర్యాప్తుపై పడుతోందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.
'అప్పుడు కీలక ఆధారాలు మిస్ అయ్యాయి!'
వైద్యురాలి మృతదేహం దొరికిన మరుసటి రోజు సెమినార్ హాల్ సమీపంలో ఉన్న రెస్ట్ రూం, టాయిలెట్‌ను కూల్చివేయాలని ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆదేశించినట్లు సీబీఐ గుర్తించిందని అధికారి పేర్కొన్నారు. అప్పుడే కీలక ఆధారాలు మిస్ అయినట్లు తాము అనుమానిస్తున్నట్లు తెలిపారు.
"జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో తగిన ఆధారాలు లేవు. అందుకే మా అధికారులు తొందరగా ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్, ఘటనాస్థలిలో లభించిన ఆధారాలు, పలువురిని ప్రశ్నించిన మీదట లభించిన వివరాల ప్రకారం వైద్యురాలిపై జరిగిన దాడిలో ఒకరికి మించిన వ్యక్తుల ప్రమేయం లేదని వెల్లడైంది. ఫోరెన్సిక్ పరీక్షల్లో బాధితురాలి, ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ డీఎన్ఏ మ్యాచ్ అయ్యింది" అని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు, కోల్‌కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసు విచారణలో భాగంగా ఆస్పత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. దాంతో మాజీ ప్రిన్సిపల్ ఘోష్‌తో సహా మరో ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది. ఈడీ కూడా ఈ అక్రమాలపై విచారణ జరుపుతోంది. దర్యాప్తులో భాగంగా, ఆర్జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్‌లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థి విగత జీవిగా కనిపించి ఉండటాన్ని గుర్తించారు. తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ, తర్వాత హత్యాచారమని దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అసలైన నేరస్థులను కాపాడేందుకు సంజయ్‌ను ఇరికించారని అతడి తరఫు న్యాయవాది వాదిస్తున్నారు.
అనుమానాలు ఎందుకంటే?
బాధితురాలి మృతదేహాన్ని గుర్తించిన వెంటనే సెమినార్ హాల్ వద్ద భారీగా జనం గూమిగూడినట్టుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో ఆధారాలు మొత్తం తారుమారయ్యాయని ఆరోపించారు. ఈ క్రమంలో సీబీఐ అధికారి ఒకరు కీలక ఆధారాలు దొరకలేదని వ్యాఖ్యానించడం గమనార్హం.