Kolkata Doctor Rape Case Twist :కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన బంగాల్‌ను కుదిపేస్తోంది. దీనికి సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ఆసుపత్రి నుంచి మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆ కాల్ చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది.
విచారణ కొనసాగుతూనే ఉంది!
పోలీసులు జూనియర్ డాక్టర్‌పై హత్యాచారంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. హత్యను ఆత్మహత్యగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, కనుక్కొనేందుకు ఆ అధికారిని కూడా ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఏడుగురు జూనియర్ డాక్టర్లను కూడా పోలీసులు ప్రశ్నించారు. అందులో నలుగురు ఆమెతో డిన్నర్ కూడా చేశారు.
అర్ధరాత్రి నిరసనలు చేపట్టనున్న మహిళలు
తమ డిమాండ్లు నెరవేరే వరకు, న్యాయం జరిగే వరకు సమ్మెను విరమించబోమని ఇప్పటికే ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. నో సేఫ్టీ-నో డ్యూటీ అంటూ నిరసనకారులు ప్లకార్డులను ప్రదర్శించారు. వీరితోపాటుగా కోల్‌కతా, బెంగాల్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు వినూత్న ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. వారంతా బుధవారం అర్ధరాత్రి నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ‘స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి - మహిళల స్వాతంత్ర్యం కోసం’ పేరిట రేపు రాత్రి 11.55 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు.
ఎక్కడెక్కడ నిరసనలు చేపట్టాలో ఆయా ప్రాంతాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనికి సంఘీభావంగా పలువురు పురుషులు కూడా ఇందులో భాగం కావాలని నిర్ణయించుకున్నారు. స్వస్తికా ముఖర్జీ, చర్నీ గంగూలీ, ప్రతిమ్ డి గుప్తా వంటి సినీ ప్రముఖులు మద్దతుగా రానున్నారు.