Cabinet Approves One Nation One Election Bill :'ఒకే దేశం- ఒకే ఎన్నికలు' బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. దీంతో కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి.
ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు!
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదముద్ర వేసింది. జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభల స్పీకర్లను సంప్రదించేందుకు కూడా ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నాయి.
ఈ సమావేశాల్లోనే బిల్లు తెచ్చేందుకు ప్లాన్
పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన నివేదికకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ ఏడాది మార్చిలో అందించారు. దీనికి కేంద్ర మంత్రివర్గం ఈ సెప్టెంబరులోనే పచ్చజెండా ఊపింది. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ జమిలి బిల్లుకు ఆమోదం తెలిపింది.
రాజ్యాంగ సవరణలు
జమిలి ఎన్నికల నిర్వహించాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 82ఏ, 83(2), ఆర్టికల్ 327 వంటి పలు ఆర్టికల్స్ సవరించాల్సి ఉంటుంది. అలాగే జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటేేతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు అందుకు అంగీకరించాలి.
'ఇదొక ముఖ్యమైన అడుగు'
మరోవైపు జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీ సహా పలువురు విపక్ష నేతలు స్పందించారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దిశకు ఒక ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు.