తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జాబిల్లి నుంచి భూమికి మట్టి, రాళ్లు!'- చంద్రయాన్‌-4కు కేబినెట్ గ్రీన్​ సిగ్నల్ - Chandrayaan 4 Mission - CHANDRAYAAN 4 MISSION

Cabinet Approves Chandrayaan-4 Mission : భూమిపైకి చంద్ర శిలలు, మట్టి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన చంద్రయాన్‌-4 మిషన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. అలాగే వీనస్ ఆర్బిటర్‌ మిషన్‌, గగన్‌యాన్‌ విస్తరణకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

Chandrayaan-4 Mission
Chandrayaan-4 Mission (ANI)

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2024, 3:46 PM IST

Updated : Sep 18, 2024, 4:31 PM IST

Cabinet Approves Chandrayaan-4 Mission : వీనస్ ఆర్బిటర్‌ మిషన్‌, గగన్‌యాన్‌, చంద్రయాన్ -4 మిషన్ల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. చంద్రయాన్‌-4 ద్వారా చంద్రునిపై నుంచి మట్టిని, శిలలను భూమి పైకి తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. లో ఎర్త్ ఆర్టిట్‌లో 30 టన్నుల పేలోడ్‌లను ఉంచేందుకు నెక్ట్స్‌ జనరేషన్ లాంఛ్‌ వెహికల్‌ను ప్రయోగించడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు.

2024 నాటికి
కేంద్ర కేబినెట్ చంద్రయాన్‌-4 మిషన్‌కు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2,104.06 కోట్లు కేటాయించారు. భారత వ్యోమగాములను చంద్రునిపై దించడం, వారిని తిరిగి సురక్షితంగా భూమిపైకి తీసుకువచ్చేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ మిషన్ చేపట్టనున్నారు. 30 టన్నుల బరువైన పేలోడ్లను దిగువ భూ కక్షలోకి తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన నెక్ట్స్‌ జనరేషన్‌ లాంఛ్‌ వెహికిల్-NGLTని అభివృద్ధి చేసేందుకు కూడా కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది.

"2040 నాటికి డాకింగ్/ అన్‌డాకింగ్, ల్యాండింగ్‌ సహా, వ్యోమగాములను సురక్షితంగా తిరిగి భూమిపైకి తీసుకురావడం. అలాగే చంద్రుని మట్టిని, అక్కడి శిలలను సేకరించి, వాటిని విశ్లేషణకు అవసరమైన ప్రధాన సంకేతికతలను వృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ చంద్రయాన్‌-4 మిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది." - కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ఇస్రో ఆధ్వర్యంలో
అంతరిక్ష నౌకల అభివృద్ధి, ప్రయోగాలు అన్నీ ఇస్రో ఆధ్వర్యంలో జరుగుతాయి. పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో కేవలం 36 నెలల్లోనే ఈ మిషన్‌ను పూర్తి చేయాలని ఇస్రో భావిస్తోంది. అయితే ఈ సంక్లిష్టమైన సాంకేతికతలను పూర్తిగా దేశీయం అభివృద్ధి చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

వీనస్ ఆర్బిటర్ మిషన్‌
వీనస్ ఆర్బిటర్‌ను మిషన్‌కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ద్వారా శుక్ర గ్రహాన్ని అధ్యయనం చేయనున్నారు. శుక్రుడి కక్ష్య, దాని ఉపరితలం, భూగర్భం, వాతావరణ ప్రక్రియలు, శుక్రుని వాతావరణంపై సూర్యుని ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడమే దీని లక్ష్యం. అందుకోసం ఒక డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఒక స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగించనున్నారు. ఈ వీనస్ ఆర్బిటర్ మిషన్ కోసం కేబినెట్‌ రూ.1,236 కోట్లు కేటాయించింది. అందులో రూ.824 కోట్లతో స్పేస్‌క్రాఫ్ట్‌ అభివృద్ధి చేయనుంది ఇస్రో.

భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం శుక్రుడు (వీనస్‌). కానీ ఈ గ్రహాల వాతావరణాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం ఉపకరిస్తుంది.

గగన్‌యాన్‌
గగన్‌యాన్ మిషన్‌ విస్తరణకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ మాట్లాడుతూ, "ప్రస్తుతం గగన్‌యాన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే మా వ్యోమగాములకు మొదటి షెడ్యూల్‌ కూడా ఇచ్చాం. తాజాగా ఈ మిషన్‌కు 'భారతీయ అంతరిక్ష్ స్టేషన్‌' ఏర్పాటు చేసే లక్ష్యాన్ని జోడించాం. మొదట్లో గగన్‌యాన్‌ ఒక్కటే లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడు మా దగ్గర ఐదు మిషన్‌లు ఉన్నాయి. కనుక మేము దీని పరిధిని మరింత విస్తృతం చేస్తాం" అని అన్నారు.

గిరిజనులు, రైతుల కోసం
గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.79,156 కోట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రైతుల ఆదాయాన్ని పెంచడం సహా, పప్పులు, నూనెగింజల సాగును పెంచేందుకు రూ.35,000 కోట్లతో రూపొందించిన పీఎం-ఆశా పథకానికి మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది రబీ సీజన్‌కు పాస్పేట్‌, పొటాషియం ఎరువులపై రూ.24,474 కోట్ల రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. పంటలకు పోషకాలను (సబ్సీడీకి) సరసమైన ధరల్లో రైతులకు అందించడమే లక్ష్యమని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ఐఐటీలు, ఐఐఎంల తరహాలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమర్సివ్‌ క్రియేటర్స్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు.

Last Updated : Sep 18, 2024, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details