Bus Fire Accident In Haryana : హరియాణాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కదులుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 9మంది సజీవ దహనం అయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి నుహ్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, పంజాబ్ చండీగఢ్‌కు చెందిన 60మంది మధుర, బృందావన్‌ను సందర్శించేందుకు ఓ టూరిస్ట్ బస్సులో వెళ్లారు. తిరిగి వస్తుండగా నుహ్ జిల్లా తావడు పట్టణ సమీపంలోని కుండలీ మానేసర్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9మంది సజీవ దహనం కాగా, మరో 24 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అయితే ఇంకా మృతులు గుర్తించలేదని పేర్కొన్నారు.
'డ్రైవర్ పట్టించుకోలేదు'
డ్రైవర్ కూడా మంటలను గమనించలేదని స్థానికులు చెబుతున్నారు. 'అర్థరాత్రి 1:30 గంటల సమయంలో బస్సు వెనుక భాగంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలను చూసిన స్థానికులు బస్సు ఆపాలని కేకలు వేశారు. డ్రైవర్ గమనించుకోకుండా వెళ్తున్నాడు. దీంతో ఓ యువకుడు బైక్‌పై బస్సును వెంబడించి ఆపాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. కానీ కొంతమంది బస్సులో కాలిపోయారు' అని స్థానికులు తెలిపారు.