Budget Session 2025 : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచి జరిగే అవకాశముంది. తొలిరోజున పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. రెండు విడతలు జరిగే ఈ సమావేశాలు తొలుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5న పార్లమెంటు కార్యకలాపాలకు సెలవు ఇవ్వనున్నారు.
బడ్జెట్‌పై గంపెడు ఆశలు
బడ్జెట్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ సామాన్యుల్లో, వేతన జీవుల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకనుగుణంగా ఈసారి పన్ను చెల్లింపుదారులకు ఊరటనివ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల సామాన్యుల కొనుగోలు శక్తి పెరిగి, వృద్ధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఫలితంగా ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ వసూళ్లు పెరిగి, ఖజానాకు పెద్ద మొత్తంలో రాబడి వస్తుందని ఆశిస్తోందని తెలుస్తోంది.
జీడీపీ వృద్ధి ఇలా!
2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం వృద్ధిని నమోదు చేసిన భారత ఆర్థిక వ్యవస్థ, 2024-25లో 6.4 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేయొచ్చని కేంద్ర గణాంక కార్యాలయం అంచనాలను వెలువరించింది. ఆర్బీఐ కూడా 6.6 శాతం వృద్ధిని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 2025 బడ్జెట్‌లో వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టొచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి.