Maharashtra Road Accident Today : మహారాష్ట్రలోని నాసిక్- పుణె జాతీయరహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఆగి ఉన్న బస్సును మినీ వ్యాన్ ఢీకొట్టడం వల్ల శుక్రవారం ఉదయం ఆ ప్రమాదం జరిగింది. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 10 గంటల ప్రాంతంలో నారాయణగావ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మినీవ్యాన్ నారాయణగావ్ వైపు వెళుతుండగా తొలుత వెనుక నుంచి వచ్చిన ఒక టెంపో దాన్ని ఢీకొట్టింది. దీంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును మినీ వ్యాన్ ఢీకొనింది. ప్రమాద తీవ్రతకు అందులో ఉన్న తొమ్మిది మంది కూడా మరణించారు.
వెంటనే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మినీవ్యాన్‌లో ఉన్న తొమ్మిది మంది మరణించినట్లు గుర్తించారు. మృతదేహాలను స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పుణె రూరల్ పోలీసు సూపరింటెండెంట్ పంకజ్ దేశ్‌ముఖ్ తెలిపారు.