Jhalawar Borewell Incident: రాజస్థాన్‌లో ప్రమాదవశాత్తూ 250 అడుగుల బోరుబావిలో పడ్డ ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. చిన్నారిని కాపాడేందుకు అధికారులు సుదీర్ఘ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు 16 గంటల తర్వాత చిన్నారిని వెలికితీశారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
అసలేం జరిగిదంటే?
ఝలావర్ జిల్లా డగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్లా గ్రామానికి చెందిన ప్రహ్లాద్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి ఆదివారం పక్కనే ఉన్న పొలాల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న 250 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడ్డాడు. గమనించిన అతడి స్నేహితులు ఉరుకులు పరుగులతో వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని తెలిపారు. వెంటనే బోరుబావి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు- ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు. దాదాపు 30 అడుగుల లోతులో బాలుడు చిక్కుకున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో పైప్‌ల ద్వారా లోపలికి ఆక్సిజన్‌ను లోపలికి పంపించారు వైద్యులు. దాదాపు 16 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన తర్వాత సోమవారం తెల్లవారుజామున 3:45 గంటలకు బాలుడిని బోరుబావి నుంచి బయటకు తీశారు. వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాలుడు ప్రహ్లాద్ తండ్రి కాలూ సింగ్ ఒక రైతని, పొలం సమీపంలోని బోరుబావికి ఎటువంటి పిట్టగోడ లేకుండా తెరిచి ఉందని పోలీసులు తెలిపారు. దానిని గమనించని బాలుడు బోరుబావిలో పడిపోయి ఉంటాడని పోలీసులు అంటున్నారు.
ఇదే తొలిసారేం కాదు
రాజస్థాన్ రాష్ట్రంలో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారేం కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి బోరుబావి ప్రమాదాల్లో చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తెరిచి ఉన్న బోర్‌వెల్ గుంతలను మూసివేయాలని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినా ఆ దిశగా రైతుల నుంచి ప్రయత్నమేదీ జరగడం లేదు. ఫలితంగా పలువురు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.