BJP Second Candidate List : సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల రెండో జాబితాను సిద్ధం చేస్తున్నాయి. బీజేపీ తన తొలి జాబితాలోనే 16 రాష్ట్రాలకు సంబంధించిన 195 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా 90 మంది అభ్యర్థులతో రెండో జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం దిల్లీలో రెండో దఫా భేటీ అయ్యింది. ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణాలోని లోక్‌సభ స్థానాల్లో పార్టీ తరఫున బరిలోకి దించాల్సిన అభ్యర్థుల పేర్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి ముందు బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, హరియాణా ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేత దుష్యంత్ చౌటాలా కలిసి ఆ రాష్ట్రంలోని సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. వాస్తవానికి హరియాణాలో జేజేపీతో పొత్తును పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ జేజేపీతోనే కలిసి వెళ్లాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించుకుంది.
40 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా సిద్ధం!
పార్టీ లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సోమవారం దిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ఆయా రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శులు, ఇతర నేతలు పాల్గొన్నారు. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాల్లోని 60కిపైగా స్థానాలపై చర్చించారు. వీటిలో దాదాపు 40 పేర్లను ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.