BJP Multi Lingual Candidate In Kerala :రాజకీయాల్లో రాణించాలంటే ఎదుటివారిని ఆకర్షించాలి. మంచి భాషతో మనసులు దోచుకొనేవారు ఏ రంగంలో అయినా త్వరగా పైమెట్టుకు వెళతారు. ఇక రాజకీయ రంగంలో అయితే సరే సరి. అప్పట్లో 16 భాషలు తెలిసిన పీవీ నరసింహారావు మన తెలుగువారే. అయితే అలా బహుభాషలతో ఆకట్టుకునే మహిళలు తక్కువ. కానీ ఇప్పుడు ఒక మామూలు టీచర్ అయిన ఓ మహిళ తనకు వచ్చిన ఆరు భాషల వల్లే సామాన్య జనంలో చొచ్చుకుపోతూ బీజేపీ అధినాయకత్వాన్ని మెప్పించారు. ఎంతగా అంటే కేరళలో మహామహులు పోటీపడిన కాసర్‌గోడ్ పార్లమెంట్ స్థానానికి పార్టీ ఆమెనే నిలబెట్టేటంతగా.
చాలా కాలంగా వామపక్షాలకు కంచుకోటగా ఉన్న కాసరగోడ్ నియోజకవర్గంలో ఎంఎల్ అశ్విని(38) బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, అశ్వినినే బీజేపీ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. అందుకు ప్రధాన కారణం అశ్వినికి ఆరు భాషలపై ఉన్న పట్టు. మలయాళం, కన్నడం, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్‌లో అశ్విని అనర్గళంగా మాట్లాడగలరు. ఆ ప్రతిభే ఆమె ఓటర్లతో మెరుగ్గా కనెక్ట్ కావడానికి సహాయపడుతుందని అధిష్ఠానం నమ్ముతోంది.
ఎవరీ అశ్విని?
ఎంఎల్ అశ్విని ఒక మామూలు స్కూల్ టీచర్. ఆమె గ్రామం మంజేశ్వరకు కేవలం బ్లాక్ పంచాయతీ మెంబర్. పార్టీలో మహిళా మోర్చా జాతీయస్థాయి సభ్యురాలు. అయినా సరే పార్టీ అధిష్ఠానం ఆమెకు పట్టం కట్టింది. కాసరగోడ్‌లో లోక్‌సభ బరిలో నిలిపింది. దానికి కారణం ఆమెకు తెలిసిన ఆరు భాషలు. మలయాళం, కన్నడం, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్.
కన్నడ మాతృ భాషగా బెంగళూరులో పుట్టి పెరిగిన అశ్విని కాసరగోడ్‌కు కోడలుగా వచ్చింది. చిన్నప్పటినుంచే ఇంగ్లీష్, హిందీ మీద పట్టున్న ఆమెకు భాషలు నేర్చుకోవటం ఇష్టం. దీంతో చుట్టుపక్కల కుటుంబాల నుంచి తుళు నేర్చుకుంది. తరువాత తమిళం, మరి కొంతకాలం తరువాత మలయాళం మీద పట్టు పెంచుకుంది. కుటుంబసభ్యులతో ఒక్కొక్కరితో ఒక్కో భాష మాట్లాడి సాధన చేసే అశ్వినికి ఆమె భాషా పరిజ్ఞానం మేలే చేసింది.