BJP MP Ravi Kishan DNA Test :రేసు గుర్రం సహా పలు తెలుగు సినిమాల్లో నటించిన యాక్టర్ రవికిషన్ శుక్లా గుర్తున్నారా? మహారాష్ట్రలో పుట్టి, ఉత్తరప్రదేశ్‌లో పెరిగిన రవికిషన్ శుక్లా భోజ్‌పురి, హిందీ సినిమాలతో చాలా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లోనూ రవికిషన్‌కే బీజేపీ గోరఖ్‌పూర్ టికెట్ ఇచ్చింది. అయితే ఓ వైపు రవికిషన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా మరోవైపు ఏప్రిల్ 15న ఆయనకు వ్యతిరేకంగా వివాదాస్పద అంశం తెరపైకి వచ్చింది. అపర్ణా ఠాకూర్ సోనీ అనే మహిళ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎంపీ రవి కిషన్ తన భర్త అని చెప్పారు. తన కుమార్తె షినోవా సోనీని విలేకరులకు పరిచయం చేశారు. రవికిషన్ తన తండ్రో కాదో తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేయాలని అప్పట్లో షినోవా సోనీ డిమాండ్ చేయడం సంచలనం క్రియేట్ చేసింది. ఈ విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోవాలని వారు కోరారు. తాజాగా ఇప్పుడు షినోవా సోనీ ఇదే అంశంపై ముంబయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వల్ల వివాదం మరింత ముదిరింది.
షినోవా ఎవరు ?
ఏదిఏమైనప్పటికీ సరిగ్గా ఎన్నికల సమయంలో అలుముకున్న ఈ వివాదం రవికిషన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇది ఎన్నికల్లో మైనస్ పాయింట్‌గా మారే అవకాశం లేకపోలేదు. రవికిషన్‌కు కుమార్తెగా చెప్పుకుంటున్న షినోవా సోనీ తన తల్లి అపర్ణా ఠాకూర్ సోనీతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. 25 ఏళ్ల షినోవా సోనీ మహారాష్ట్రలో పలు చిన్న సినిమాల్లో నటించింది. మోడల్‌గానూ పనిచేస్తోంది. కొన్ని ప్రముఖ యాడ్స్‌లో కూడా ఆమె నటించారు. కునాల్ కోహ్లీ తీసిన వెబ్ సిరీస్ 'హికప్స్ అండ్ హుకప్స్'లో మాజీ మిస్ యూనివర్స్, నటి లారా దత్తాతో కలిసి షినోవా నటించారు.
షినోవా పిటిషన్‌లో ఏముంది ?
తాజాగా బాంబే హైకోర్టులో పిటిషన్ వేసిన షినోవా, గోరఖ్‌పుర్ బీజేపీ ఎంపీ రవికిషన్‌ను తన తండ్రిగా పేర్కొన్నారు. ఈవిషయాన్ని తేల్చేందుకు రవికిషన్‌కు డీఎన్‌ఏ టెస్ట్ చేయాలని కోర్టును కోరారు. ఒకవేళ ఈ డీఎన్‌ఏ టెస్టులో ఫలితం అనుకూలంగా వస్తే తనను రవికిషన్ కుమార్తెగా అధికారికంగా గుర్తించాలని పిటిషన్‌లో షినోవా ప్రస్తావించారు. కూతురిగా తన బాధ్యతను స్వీకరించడానికి రవికిషన్ నిరాకరించకూడదని ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును ఆమె అభ్యర్థించారు.