BJP Lok Sabha Election Manifesto : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప పత్ర' పేరుతో దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కలిసి ఆదివారం మేనిఫెస్టోను ప్రకటించారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో 14 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ రూపొందించింది. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా సంకల్పపత్ర రూపకల్పన చేశారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది. ఇందుకోసం 4లక్షల మంది పంపిన 15 లక్షల సలహాలు, సూచనలను పరిశీలించి కీలకాంశాలను పొందుపరిచింది.
మేనిఫెస్టో విడుదల కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. 'బంగాల్, అసోం, ఒడిశా, కేరళ, తమిళనాడులో ఈరోజు పండుగలు జరుపుకుంటున్నారు. నవరాత్రుల్లో భాగంగా ఇవాళ కాత్యాయనీ దేవి పూజ చేసుకుంటాం. ఇవాళ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి కూడా. సంకల్ప్ పత్ర తయారుచేసిన రాజ్‌నాథ్ బృందానికి అభినందనలు. సంకల్ప్ పత్ర తయారీకి సూచనలు ఇచ్చిన లక్షలమందికి అభినందనలు. నాలుగు స్తంభాలతో సంకల్ప్ పత్రకు పునాదులు వేశాం. యువశక్తి, నారీశక్తి, గరీబ్, కిసాన్‌ను దృష్టిలో ఉంచుకునే సంకల్ప్ పత్ర తయారీ చేశాం. దేశ యువత ఆకాంక్షలను మా సంకల్ప్ పత్ర ప్రతిబింబిస్తోంది. ఈ పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. మోదీ పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం' అని మోదీ చెప్పారు. అనంతరం, విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడావికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటి మేనిఫెస్టోలో పొందుపర్చిన 14 అంశాలను వివరించారు.
మేనిఫెస్టోలోని కీలక హామీలు
- 70 ఏళ్లు పైబడిన వృద్ధిలకు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
- పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు కట్టించడం
- పైపు ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందజేత
- వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేసే దిశగా కృషి
- దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం
- ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్
- మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులకు మార్చే ప్రణాళిక