వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం - WAQF BILL
14 సవరణలతో వక్ఫ్ సవరణ బిల్లు- ఆమోదించిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ
Published : Jan 27, 2025, 3:16 PM IST
Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ -JPC పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా, 14 సవరణలను కమిటీ ఆమోదించినట్లు ప్యానెల్ ఛైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు. ఈ సవరణలు చట్టాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కమిటీలో ఎన్డీయే సభ్యులు సూచించిన మార్పులకు ఆమోదం లభించగా, విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యాయి. ఫలితంగా ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కమిటీ పనిచేయలేదని విపక్ష సభ్యులు ఆరోపించారు. మొత్తంగా జేపీసీ సూచించిన 14 ప్రతిపాదనల ఆమోదానికి సంబంధించి జనవరి 29న ఓటింగ్ జరగనుంది. జనవరి 31న తుది నివేదిక లోక్‌సభకు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.