Maharashtra CM Oath Taking Ceremony :మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. దేవేంద్ర ఫడణవీస్ సీఎంగా ప్రమాణం చేయడం ఇది మూడోసారి కావడం విశేషం. అనంతరం శివసేన పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ శిందే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ముంబయి ఆజాద్ మైదాన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలతోపాటు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
మోదీ శుభాకాంక్షలు
నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఫడణవీస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్‌ను ప్రధాని అభినందించారు.
బాధ్యత పెరిగింది
దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆయన భార్య అమృత ఫడణవీస్ మీడియాతో మాట్లాడారు. సీఎంగా ఆయనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. 'ఫడణవీస్ ఆరోసారి ఎమ్మెల్యే అయ్యారు. మూడోసారి సీఎం కానున్నారు ఈ విషయంలో ఆనందం కన్నా, ఆయనపై పెద్ద బాధ్యత ఉందనే భావన కలుగుతోంది' అని అమృత పేర్కొన్నారు.