BJP First List Loksabha Election 2024 :మరికొన్ని నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంపై భారతీయ జనతా పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. తొలి జాబితా విడుదలకు పార్టీలోని కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సమావేశమయ్యే అవకాశం ఉంది. దీంతో వివిధ రాష్ట్రాల్లో టికెట్ ఆశావహుల వడపోతపై పార్టీ అధిష్ఠానం బుధవారం మంతనాలు జరిపింది.
ఫస్ట్ లిస్ట్‌లో మోదీ, షా
మధ్యప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వేర్వేరుగా చర్చించారు. ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నేతలతో ఇప్పటికే ఇలాంటి భేటీలు ముగిశాయి. అయితే లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా పేర్లు ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలవని అనేక స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ఉండవచ్చని చెప్పాయి.
మొన్నటిలానే!
అయితే 2019 సార్వత్రిక ఎన్నికల జాబితాకు సంబంధించి తొలి జాబితాలో మోదీ, షా ఉన్నారు. అప్పుడు పార్టీ సారథిగా ఉన్న అమిత్ షా తొలిసారి గాంధీనగర్ నుంచి లోక్‌సభ బరిలో దిగారు. ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాతే అప్పట్లో అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యాయి. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం షెడ్యూలు వెలువడడానికి ముందే అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు గాను అలాగే చేసే అవకాశం ఉంది.
పోలింగ్ బూత్‌లలో వీడియో చిత్రీకరణ!
సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ బూత్‌లలో వీడియో చిత్రీకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం కేంద్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించారు. ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు, ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధించాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని చెప్పారు.