BJP Fires On Congress Over Article 370 :జమ్ముకశ్మీర్‌పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడి అసువులు బాసిన బిహార్, రాజస్థాన్‌కు చెందిన భద్రతా సిబ్బందిని అవమానించేలా ఖర్గే వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. బిహార్‌లో ఎన్నికల సభలో పాల్గొన్న మోదీ జమ్ముకశ్మీర్‌లో ఇన్నేళ్లు రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేదని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.
"కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు చిన్న పదవిలో లేరు. ఇటీవల ఆయన రాజస్థాన్‌లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. మోదీ రాజస్థాన్ వచ్చి ఆర్టికల్ 370 గురించి మాట్లాడతారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత నాకు చాలా సిగ్గేసింది. జమ్ముకశ్మీర్ మనది అవునా? కాదా? కశ్మీర్‌ను రక్షించేందుకు బిహార్‌కు చెందిన అనేకమంది యువకులు మాతృభూమి కోసం ప్రాణ త్యాగాలు చేశారు. రాజస్థాన్‌లోనూ ఇలాంటి అమరవీరులు ఎందరో ఉన్నారు. కశ్మీర్‌ను రక్షించే క్రమంలో ఎందరో అమరులయ్యారు. ఇది 'తుక్‌డే-తుక్‌డే'గ్యాంగ్ మనస్తత్వం. అందుకే వారు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి భాష మాట్లాడే వారిని క్షమిస్తామా?" అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు.
ఇక్కడ ఆ విషయం ఎందుకు?: ఖర్గే
రాజస్థాన్‌లో శనివారం పర్యటించిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌కు వచ్చిన మోదీ ఇక్కడ కశ్మీర్ అంశం ప్రస్తావించారని అసలు రాజస్థాన్‌కు అధికరణ 370 ఉపసంహరణకు మధ్య ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఇక్కడకు(రాజస్థాన్) వచ్చి మేం కశ్మీర్‌లో 370 అధికరణను రద్దు చేశామని చెప్పారని అన్నారు. ఆర్టికల్ 370కు రాజస్థాన్ ప్రజలకు అసలు సంబంధం ఏంటని ప్రశ్నించారు. మీరు(మోదీ) కశ్మీర్ వెళ్లి అక్కడ 370 ఆర్టికల్ గురించి చెప్పాలని హితవు పలికారు.
'ఉగ్రవాదులకు కాంగ్రెస్ బిర్యానీ తినిపించింది'
మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ కూడా మండిపడింది. కాంగ్రెస్ పార్టీ ఇటాలియన్ సంస్కృతిని అవలంబిస్తోందని, భారత ఆలోచనలను ఆ పార్టీ ఎప్పుడూ అర్థం చేసుకోలేదని హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలపై జమ్ముకశ్మీర్ ప్రజలకు మాట్లాడే హక్కు ఉన్నట్లే జమ్ముకశ్మీర్‌పై మాట్లాడే హక్కు ప్రతి పౌరుడికి ఉందని షా అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించిందని విమర్శించిన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్, ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌కు కాంగ్రెస్ చేసిన గాయాన్ని తాము నయం చేశామని తెలిపారు.