తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ 3.0 టార్గెట్​గా బీజేపీ మాస్టర్​ ప్లాన్- 360 డిగ్రీలు పరిశీలించి అభ్యర్థుల ఎంపిక- 130మంది సిట్టింగులకు నో టికెట్​ - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

BJP Drops Sitting MPs : బీజేపీ 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్‌ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది.

BJP Drops Sitting MPs
BJP Drops Sitting MPs

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 9:50 AM IST

BJP Drops Sitting MPs :2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మొత్తం 303 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఆ సిట్టింగ్‌ స్థానాల్లో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వివిధ కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది. మధ్యప్రదేశ్‌లో ఐదుగురు, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో ముగ్గురు చొప్పున ఎంపీలు శాసనసభకు ఎన్నిక కావడం వల్ల వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇచ్చింది. ఇక హరియాణా, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కో సిట్టింగ్‌ ఎంపీ కన్నుమూశారు. రాజస్థాన్‌లో ఒకరు, హరియాణాలో మరొకరు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఆయా స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పించింది బీజేపీ. బంగాల్‌లో ఇద్దరిని, దిల్లీ, కర్ణాటకల్లో ఒక్కో సిట్టింగ్‌ ఎంపీని ఒక స్థానం నుంచి మరో నియోజకవర్గానికి మార్చింది. ఈ 20 సీట్లను మినహాయిస్తే మిగిలిన 110 చోట్ల సిట్టింగ్‌లకు టికెట్‌ నిరాకరించి, కొత్తవారిని రంగంలోకి దించింది.

కేంద్ర మంత్రులకు నో
బీజేపీ ఈసారి 11మంది కేంద్ర మంత్రులకు టికెట్ నిరాకరించింది. స్థానిక సామాజిక పరిస్థితులు, విజయావకాశాలు, పనితీరు సరిగా లేకపోవడం, అనారోగ్యం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తదితర కారణాలతో బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో అశ్వినీకుమార్‌ చౌబే, జనరల్‌ వీకే సింగ్‌, దర్శనావిక్రమ్‌ జర్దోస్‌, మీనాక్షి లేఖి, సోమ్‌ప్రకాశ్‌, రామేశ్వర్‌ తేలీ, ఎ.నారాయణ స్వామి, ప్రతిమాభౌమిక్‌, రాజ్‌కుమార్‌ రంజన్‌సింగ్‌, బిశ్వేశ్వర్‌ టుడు, మంజుపారా మహేంద్రభాయ్‌ ఉన్నారు. పంజాబ్‌లోని హోశియార్‌పుర్‌లో కేంద్ర మంత్రి సోమ్‌ప్రకాశ్‌ను పక్కనపెట్టినప్పటికీ ఆ స్థానంలో ఆయన సతీమణికి అవకాశం కల్పించారు.

గుజరాత్​లో 14మందికి మొండిచేయి
అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అభ్యర్థుల ఎంపికలో 360 డిగ్రీల పరిశీలన చేసింది. ఏ చిన్న కోణాన్నీ వదిలిపెట్టకుండా అంతర్గత సర్వేలు, ప్రజల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా పోటీ దారులను ఎంపిక చేసింది. ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో పార్టీకి మొత్తం 26 మంది సిట్టింగ్‌ ఎంపీలు ఉండగా వారిలో ఏకంగా 14 మందిని ఇంటికి సాగనంపింది. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలోనూ భారీగానే సిట్టింగ్‌లకు మొండిచేయి చూపింది. బీజేపీ నాయకత్వ వ్యవహారశైలిని వ్యతిరేకించే విధంగా పత్రికల్లో వ్యాసాలు రాసినందుకు వరుణ్‌గాంధీని, తన కుమారుడికి టికెట్‌ ఇవ్వకపోతే పార్టీ మారుతానన్నట్లు వ్యవహరించిన రీటా బహుగుణను, 400కుపైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్నందుకు అనంతకుమార్‌ హెగ్డేను, చట్టసభలో మైనార్టీ ఎంపీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు రమేష్‌ బిధూరీకి బీజేపీ టికెట్ నిరాకరించింది. మొత్తంగా కమలదళం ఇప్పటివరకు 433 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది.

ABOUT THE AUTHOR

...view details