BJP Candidate Passed Away :లోక్‌సభ ఎన్నికల్లో భాగంగాఉత్తర్ప్రదేశ్ మురాదాబాద్ ఎంపీగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కువర్ సర్వేశ్ కుమార్(72) గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌధరీ వెల్లడించారు. సర్వేశ్కు గొంతు సంబంధిత వ్యాధితో కొన్నిరోజులుగా బాధపడుతున్నారని, ఇటీవల ఆపరేషన్ కూడా జరిగిందని చెప్పారు.
ఓటు వేసిన తర్వాత!
అయితే లోక్‌సభ ఎన్నికల తొలి దశలో మురాదాబాద్ నియోజకవర్గానికి శుక్రవారం పోలింగ్ జరిగింది. 60.60 శాతం ఓటింగ్ నమోదైంది. కున్వర్ సర్వేశ్ కుమార్ ఓటు కూడా వేశారు. అనంతరం ఎయిమ్స్ చికిత్స కోసం చేరారు. ఓటింగ్ జరిగిన తర్వాతే రోజు సర్వేశ్ మరణించడం, ఆయన అనుచరులతోపాటు పార్టీ కార్యకర్తల్లో తీవ్ర విషాదం నింపింది. సర్వేశ్ కుమార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీతోపాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంతాపం తెలిపారు.
చివరి శ్వాస వరకు ప్రజాసేవకే!
కువర్ సర్వేశ్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. "మురాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ కువర్ సర్వేశ్ సింగ్ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా. ఆయన తన చివరి శ్వాస వరకు ప్రజాసేవకు, సామాజిక సేవకే అంకితమయ్యారు. ఆయన మరణం కోలుకోలేనిది. సర్వేశ్ కుటుంబానికి తట్టుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని మోదీ ట్వీట్ చేశారు.
'సర్వేశ్ మృతి బీజేపీకి తీరని నష్టం'
"మురాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ కున్వర్ సర్వేశ్ సింగ్ జీ మరణ వార్త విని షాక్ అయ్యాను. ఆయన మృతి బీజేపీకి తీరని నష్టం. సర్వేశ్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. శ్రీరాముడి పాదాల చెంత ఆయన ఆత్మకు చోటు దక్కాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబసభ్యులకు భగవంతుడు తగినంత శక్తి ఇవ్వాలి" అని యోగి ట్వీట్ చేశారు.
బాహుబలి నేతగా పేరు!
కువర్ సర్వేశ్ కుమార్ సింగ్‌ను రాకేశ్ సింగ్ అని కూడా స్థానికులు పిలుస్తారు. రాజ్పుత్ సామాజికవర్గానికి చెందిన ఆయన 1952లో డిసెంబర్ 23వ తేదీన జన్మించారు. యూపీ బాహుబలి నేతల్లో ఒకరిగా పేరొందిన ఆయన 1991-2007, 2012-2014 వరకు ఐదు సార్లు ఠాకూర్ ద్వారా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2009లో మురాదాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి మహమ్మద్ అజహరుద్దీన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో అదే స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఎస్‌టీ హసన్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మురాదాబాద్ నుంచి మరోసారి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. కానీ ఓటింగ్ జరిగిన ఒక్కరోజు తర్వాత మరణించారు.
కుమారుడు బీజేపీ ఎమ్మెల్యేనే!
వ్యక్తిగత విషయానికొస్తే, 1983లో సాధనా సింగ్‌ను వివాహం చేసుకున్నారు సర్వేశ్ కుమార్. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సర్వేశ్ కుమారుడు కువర్ సుశాంత్ సింగ్ ప్రస్తుతం బర్హాపుర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. అయితే సర్వేశ్ మరణం కౌంటింగ్తోపాటు ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదు. ఒకవేళ ఎన్నికల్లో సర్వేశ్ సింగ్ గెలిస్తే, మురాదాబాద్ స్థానాన్ని ఖాళీగా ప్రకటించి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు అధికారులు.